కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి G. కిషన్ రెడ్డి...కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ సభలో మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అవినీతి మరియు అక్రమాలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది లోక్‌సభ స్థానాలు మరియు రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిందని గుర్తు చేస్తూ, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ కుటుంబ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని, రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
బీజేపీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని పేర్కొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ “కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలంటే కాంగ్రెస్” అని రేవంత్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించారని చెప్పారు. కాంగ్రెస్‌లో హిందుత్వ భావజాలం లేదని కూడా విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంతో ఉందని పేర్కొంటూ, హైస్పీడ్ రైళ్లు, మౌలిక వసతులు వంటి పలు రంగాల్లో కేంద్రం లక్షల కోట్ల రూపాయల నిధులు అందిస్తోందన్నారు. సన్నబియ్యం సరఫరా పథకంలో కూడా 80 శాతం నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని తెలిపారు.















