
కరీంనగర్: ప్రధాని నరేంద్ర మోడీ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. మోడీని చూసి రేవంత్ భయపడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పై బండిసంజయ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సిఎం కెసిఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ముందా? కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోరా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపై సిఎం రేవంత్ రెడ్డి మళ్లీ వెనుకడుగు వేస్తున్నారని అన్నారు. కెసిఆర్ తో బేరం కుదరలేదా? ఢిల్లీకి సరిగా మూటలు ముట్టడం లేదా? అన్ని కేసులను సిబిఐకు ఎందుకు అప్పగిస్తారు? అని ప్రశ్నించారు. రైతులు ఏడుస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదా ఎంతమంది చనిపోతే సిఎం రేవంత్ రెడ్డి కళ్లు చల్లబడతాయని నిలదీశారు. కొనుగోళ్లు వెంటనే జరపాలని కోత పెడితే ఊరుకోమని హెచ్చరించారు.













