
దేశవ్యాప్తంగా పలు వివాదాలతో సంచలనం రేపుతున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) సెగ ఇక తెలుగు రాష్ట్రాలకు తాకనుంది. వేసవి కాలం ముగిసి తొలకరి రుతుపవనాలు ప్రవేశించే జూన్ నెలలో తెలంగాణలో ‘సర్’ వేడి మొదలుకానుంది. ఇప్పటికే దేశంలో రెండు దశల్లో ముగిసిన ఓటర్ల జాబితా ప్రక్షాళన తుది మూడో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా మొత్తం 16 రాష్ట్రాల్లో, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నారు. మొదటి రెండు దశల్లో పశ్చిమబెంగాల్, అసోం, బీహార్, తమిళనాడు, కేరళ, రాష్ట్రాల్లో అక్కడి అసెంబ్లీ ఎన్నికల ముందు ‘సర్’ ప్రక్రియ నిర్వహించడంతో ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు చాలా కాలం ఉన్నా రాష్ర్టంలో ‘సర్’ రాజకీయ వేడి పుట్టించింది. స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎలాంటి విమర్శలు ఎదుర్కోకుండా నిష్పక్షపాతంగా తెలంగాణలో ‘సర్’ను విజయవంతంగా పూర్తిచేయాలని రాష్ర్ట ఓటర్లు కోరుకుంటున్నారు. కాలానుగుణంగా దేశంలో ఓటర్ల జాబితాను ప్రక్షాళించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. దేశంలో ఇంతకుముందు 195152, 1960, 1980, 1993, 1995, 2002 2004 సంవత్సరాల్లో దేశంలో ‘సర్’ ప్రక్రియ నిర్వహించారు.
199395లో ఎన్నికల గుర్తింపు కార్డు జారీచేసే సమయంలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను సవరించారు. 2025 26లో భాగంగా తొలుత బీహార్‌లో, అనంతరం 12 రాష్ట్రాల్లో ‘సర్’ నిర్వహించి, ఇప్పుడు చివరగా 16 రాష్ట్రాల్లో, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్’ చేపట్టేందుకు సిద్ధమైంది. ఓటర్ల జాబితాలో డూప్లికేట్, చనిపోయిన వారు, చిరునామా మారిన వారు, రెండు చోట్ల ఓట్లు ఉన్నావారు, అర్హత లేని వారి పేర్లను తొలగించి ప్రక్షాళన చేయడమే ‘సర్’ లక్ష్యమని ఎన్నికల సంఘం పదేపదే చెబుతున్నా దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ కూటమియేతర పార్టీలు మాత్రం ‘సర్’ ప్రక్రియను ‘ఎంపిక చేసిన ప్రక్షాళన’గా విమర్శిస్తున్నాయి. దీనిపై పలు రాజకీయ పార్టీలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాయి. ‘సర్’ ప్రక్రియ ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా నిర్వహించడం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత భారత ఎన్నికల సంఘంపైన ఉంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని ఎన్నికల సంఘం చెబుతున్నా తెలంగాణలో రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ర్టంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం అధికారులను కలిసి తమ సందేహాలు, సూచనలు తెలియజేస్తున్నారు. పార్టీలు తమ నేతలను, కార్యకర్తలను ‘సర్’పై జాగృతం చేశాయి.
తెలంగాణలో ప్రారంభం కానున్న ‘సర్’పై అనుమానాలకు కారణం ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలే. మొదటి రెండు దశల్లో మొత్తం 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో చేపట్టిన మొదటి రెండు దశ ‘సర్’ ప్రక్రియలో దాదాపు 7.2 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయి. అదే సమయంలో సుమారు 2 కోట్ల మంది ఓటర్లను చేర్చారు. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే బీహార్‌లో 65 లక్షలు (8.3%), ఉత్తరప్రదేశ్‌లో 2.5 కోట్లు (13%), తమిళనాడులో 97.3 లక్షలు (14%), పశ్చిమబెంగాల్‌లో 90 లక్షలు (11%), గుజరాత్‌లో 70 లక్షలు (14.5%), మధ్యప్రదేశ్‌లో 34.25 లక్షలు (6%), రాజస్తాన్‌లో 31 లక్షలు (5.7 #), చత్తీస్‌గఢ్ లో 25 లక్షలు (11%) ఓట్లు ‘సర్’లో తొలగించారు. మరోవైపు గోవా, లక్షద్వీప్, అండమాన్ నికోబార్‌లో పూర్తి గణాంకాలు వెల్లడి కాలేదు.
‘సర్’ ప్రక్రియ చేపట్టిన రాష్ట్రాల్లో ప్రధానంగా బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, అసోంలో వివాదాలు రేగాయి. బీహార్‌లో మొదట కోటి వరకు ఓట్లు తొలగిస్తారనే ప్రచారం జరిగినా రాజకీయ దుమారం, న్యాయస్థానాల జోక్యంతో చివరికి 65 లక్షల ఓట్లు రద్దు అయ్యాయి. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్‌లో ‘సర్’ దేశవ్యాప్తంగా సంచనలం రేపింది. ఉన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు పారదర్శకత కోసం న్యాయమూర్తులను పరిశీలకులుగా నియమించి ప్రజాస్వామ్యంపై భరోసా కలిగించింది. పలు సందర్భాల్లో ఎన్నికల సంఘానికి, రాష్ర్ట ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. పశ్చిమబెంగాల్‌లో బిఎల్‌ఒలపై ఒత్తిడి పెరిగి దురదృష్టవశాత్తు కొంత మంది మరణించిన ఘటనలు కూడా జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తర్వాత కూడా ఇంకా పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల తొలగింపు కేసులు న్యాయస్థానాల్లో ఉన్నాయి. తమిళనాడులో నాడు అధికారంలో ఉన్న డిఎంకె 97 లక్షల ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టింది.
గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఓట్లు తొలగించారనే ఆరోపణలున్నాయి. అసోంలో అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల అంశంతో ‘సర్’ సున్నితంగా మార్చింది. పలు రాష్ట్రాల్లో ‘సర్’ వివాదాస్పదమైన నేపథ్యం లో తెలంగాణలో కూడా ఎలా జరుగుతుందో అదే ఆందోళన కలగడం సహజమే. తెలంగాణలో ‘సర్’ నిర్వహణలో భాగంగా 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు బిఎల్‌ఒలు రాష్ర్టవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను ధ్రువీకరించనున్నారు. జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది జాబితా అక్టోబర్ 1 లేదా అక్టోబర్ 10న విడుదల చేసే అవకాశముంది. రాష్ర్టంలో ఇప్పటికే ర్యాండవ్‌ు మ్యాపింగ్ చేపట్టారు. 2002 ఓటర్ల జాబితాతో సరిపోలుస్తూ మ్యాపింగ్ నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 3.32 కోట్ల మంది ఓటర్లుండగా ఇప్పటివరకు జరిగిన మ్యాపింగ్ ఆధారంగా 50 లక్షలకుపైగా ఓటర్లు తగ్గవచ్చనే అంచనాలున్నాయి. ఎన్నికల సంఘం రూపొందించిన ‘డెమోగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్’ సాఫ్ట్‌వేర్‌తో బోగస్, డూప్లికేట్, రెండు చోట్ల ఉండే ఓట్లు తొలగించే వీలుంది. ప్రధానంగా గ్రేటర్ శివార్లలో, కొత్త కాలనీల్లో భారీగా ఓట్లు తొలగించడం, జోడించడం జరిగే అవకాశాలున్నాయి. బిఎల్‌ఒలు, ఎన్యూమరేటర్లు రెండు మూడు సార్లు వచ్చి మరీ తనిఖీలు చేసిన తర్వాతనే తుది జాబితాను రూపొందిస్తారు. ఓటరు రిసిప్ట్ కాపీని డిజిటల్ రికార్డులో భద్రపరుస్తారు. ఓటర్లు 11 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తమ రుజువుగా చూపించవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది.
రాష్ర్టంలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ‘సర్’లో కేంద్రబిందువుగా మారే అవకాశాలున్నాయి. నగరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఎపి నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారితోపాటు ఇతర దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు భారీగా ఉన్నారు. వీరిలో కొందరికి రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లుండే అవకాశాలున్నాయి. మ్యాపింగ్‌లో ఓటర్లు కనిపించకపోవడంతో ఇక్కడ ‘సర్’ ప్రక్రియలో ఓట్లు తొలగింపు వివాదం కావచ్చు. నగరంలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు నకిలీ పత్రాలతో ఓటర్లుగా ఉన్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో సదరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొనే అవకాశాలుంటాయి. సున్నిత ప్రాంతాల్లో అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకొని ‘సర్’ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే నగరంలో మ్యాపింగ్ చేపట్టడంలో కొన్ని రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడంతో అనర్హులు విధులు నిర్వహిస్తున్నరనే ప్రచారం జరుగతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే తెలంగాణలో కూడా ‘సర్’ వివాదాస్పదమయ్యే అవకాశాలున్నాయి.ఓటర్ల జాబితా ప్రక్షాళనలో ఎన్నికల సంఘంతోపాటు రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. పోలింగ్ బూత్ స్థాయిలో అధికారిక బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్‌ఒ), రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్ (బిఎల్‌ఎ) పాత్ర క్రియాశీలకమైంది. తెలంగాణలో ఒక్కో బిఎల్‌ఒ పరిధిలో సగటున 930 మంది ఓటర్లున్నారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయిలోనే ఓటర్ల జాబితా రూపొందిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉంటే వివాదాలు అరికట్టవచ్చు. ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియ పునాది. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా కీలకం. ఓటర్ల జాబితా ప్రక్షాళన ‘సర్’పై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా, పారదర్శకంగా ప్రక్రియ సాగితేనే ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. అనర్హులను తొలగించి అసలైన అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తే దేశంలో వివాదాస్పదం అవుతున్న ‘సర్’ నిర్వహణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. కాబట్టి ‘సర్’ ప్రక్రియ రాజకీయ వివక్ష లేకుండా నిజాయితీగా, పారదర్శకంగా జరిగితేనే ఎన్నికల సంఘం చెబుతున్న “ప్యూరిఫికేషన్”పై ప్రజల్లో “క్లారిఫికేషన్” వస్తుంది. ‘సర్’ అందరికీ సమ్మతం కావాలి. లేదంటే తెలంగాణలో కూడా ‘సర్’ మరో రాజకీయ తుపానుగా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేం.
ఐ.వి.మురళీ కృష్ణ శర్మ











