
పంజాబ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అమృత్‌సర్ చేరుకున్న మంత్రి ముందుగా గురుద్వారాలోని పవిత్ర సరస్సు వద్ద శుద్ధి స్నానం చేసి, అనంతరం స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి గురుగ్రంథ్ సాహిబ్‌కు నమస్కరించి దేశం, రాష్ట్రం ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రిని సాదరంగా ఆహ్వానించి, ఆలయ విశిష్టతలు, చరిత్ర గురించి వివరించారు. తరువాత మంత్రి గురుద్వారా సంప్రదాయం ప్రకారం లంగర్ సేవలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. స్వర్ణ దేవాలయం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు దేశ ఐక్యతకు, సాంస్కృతిక విలువల పరిరక్షణకు ప్రతీకలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఆ రాష్ట్ర ప్రోటోకాల్ అధికారులు, స్థానిక ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.













