మన తెలంగాణ/ హైదరాబాద్: అమెరికా వెళ్లాల్సిన ఎన్‌ఆర్‌ఐ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేదోడువాదోడుగా ఉంటున్న కుమారుడి మరణంతో అతని తల్లిదండ్రులు భోరునవిలపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని ముదినేపల్లి మండలం వనుదుర్రు గ్రామానికి చెందిన జయరాం (27) అమెరికాలో సాఫ్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అయితే బంధువుల వివాహ వేడుక కోసం ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు.

శుభకార్యం ముగించుకుని అమెరికాకు వెళ్లేందుకు శనివారం తెల్లవారుజామున కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరాడు. ఏలూర్ జిల్లాలోని ముదినేపల్లి మండలం జాతీయ రహదారిపై చినపాలపర్రు వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో జయరాం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి వచ్చి తిరిగి వెళుతున్న యువకుడు ఇలా విగతజీవిగా మారడంతో వనుదుర్రు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.