
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్ సీజన్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సిబి ఆరింటిలో విజయం సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో బెంగళూరు అసాధారణ రీతిలో చెలరేగి పోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆర్‌సిబి బౌలర్లు చుక్కలు చూపించారు. హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్‌లు అద్భుత బౌలింగ్‌తో చెలరేగి పోయారు. వీరి ధాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఐపిఎల్ చరిత్రలోనే ఢిల్లీ అత్యంత చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. పవర్ ప్లేలో ఆడిన ఆరు ఓవర్లలో ఢిల్లీ 13 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో ఏకంగా ఆరు వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఐపిఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా పవర్ ప్లేలో ఇంత తక్కువ స్కోరు సాధించలేదు.
కానీ ఆర్‌సిబి బౌలర్లు ధాటికి ఎదురు నిలువలేక ఢిల్లీ ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో బెంగళూరు అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకొంటోంది. విరాట్ కోహ్లితో పాటు కెప్టెన్ రజత్ పటిదార్, దేవ్‌దుత్ పడిక్కల్, జాకబ్ బెథెల్, టిమ్ డేవిడ్, షెఫర్డ్, జితేశ్ శర్మ తదితరులు అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. బౌలింగ్‌లో కూడా బెంగళూరు మెరుగైన ప్రదర్శనతో అలరిస్తోంది. హాజిల్‌వుడ్, భువనేశ్వర్, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్య, రసిఖ్ తదితరులు అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ తర్వాత ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్న జట్టు బెంగళూరు మాత్రమే.












