ముంబై: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగే కీలక మ్యాచ్‌లో మాజీ విజేత ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ ఈసారి కూడా గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తున్న సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన అభిషేక్ చెలరేగితే ఈ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌కు తిరుగు ఉండదు.

ఇషాన్ కిషన్ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగైన ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. హెన్రిచ్ క్లాసెన్ కూడా ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా ఉంటున్నాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగి పోతున్నాడు. ముంబైపై కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు.

నితీశ్ కుమార్ రెడ్డి కూడా మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. క్లిష్ట సమయాల్లో ధాటిగా ఆడుతూ జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. అనికేత్ వర్మ, సలీల్ అరోరా తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక కమిన్స్ చేరికతో బౌలింగ్ మరింత బలోపేతంగా మారింది. సకిబ్ హుస్సూన్, మలింగ, నితీశ్ తదితరులతో ఈ విభాగం కూడా బాగానే ఉంది. మరోవైపు ముంబైకి ఈ మ్యాచ్ సవాల్‌గా తయారైంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై బలమైన సన్‌రైజర్స్‌కు ఏ మేరకు పోటీ ఇస్తుందో వేచి చూడాల్సిందే.