బెంగళూరు: ఐపిఎల్ సీజన్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ కళ్లు చెదిరే శతకం సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సుదర్శన్ 58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సిబి 18.5 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ విరాట్ కోహ్లి 44 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.