ఫోటోగ్రఫీ ప్రియుల కోసం మోటరోలా సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ దీనిని మోటో G మ్యాక్స్ 5G పేరిట లాంచ్ చేసింది. ఇది DSLR కెమెరాతో తీసే ఫోటోల మాదిరిగానే ఫోటోలను తీస్తుంది. ఈ పరికరం మోటో మిడ్-రేంజ్ G లైనప్‌లో సరికొత్త మోడల్‌గా కొన్ని గ్లోబల్ మార్కెట్లలో విడుదల అయింది. ఇప్పుడు ఈ పరికరానికి సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.


ధరెంత?

మోటో జి మ్యాక్స్ 5జి స్మార్ట్‌ఫోన్ బ్రెజిల్‌లో BRL 2,519.10 (సుమారుగా రూ. 47,000) ధరకు విడుదల అయింది. ఈ ఫోన్ 8GB + 256GB స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని మోటరోలా బ్రెజిల్ ఆన్‌లైన్ స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు. మోటో జి మ్యాక్స్ 5జి అజుల్ క్లారో, గ్రాఫైట్ అనే రెండు రంగులలో లభిస్తుంది.


ఫీచర్లు

మోటో జి మ్యాక్స్ 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.8-అంగుళాల 1.5K సూపర్ HD (1,272×2,772 పిక్సెల్స్) ఎక్స్‌ట్రీమ్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణకు మద్దతు ఇస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66 + IP68 + IP69 రేటింగ్‌లు అందించారు. ఈ మోటరోలా ఫోన్ 2.5GHz క్లాక్ స్పీడ్ గల మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్‌లో ARM మాలి-G57 MC2 GPU ఉంది.

కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రైమరీ కెమెరా 200-మెగాపిక్సెల్. ఈ సెన్సార్ f/1.8 అపెర్చర్, 10x డిజిటల్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు ఈ ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే, ఈ మోటో ఫోన్ 5,200mAh బ్యాటరీతో 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, ఒక USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.