
న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరిలో ఎంసిఎక్స్ మార్కెట్లో కిలో రూ.4 లక్షల మార్కును దాటిన వెండి ధరలు, గత ఏడు నెలలుగా వరుసగా క్షీణిస్తూ ప్రస్తుతం 40% పైగా పడిపోయాయి. ముంబై స్పాట్ మార్కెట్లో వెండి ధర కిలో రూ. 2.35 లక్షలకు చేరుకుంది. గతంలో ఏడాది వ్యవధిలోనే 300% పైగా ధరలు పెరిగిన సమయంతో పోలిస్తే ఇప్పుడు వెండి భారీ క్షీణతను చూసింది. ధరలు తీవ్రంగా తగ్గినప్పటికీ, కొత్తగా కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం లేదు. గతంలో అధిక ధర వద్ద వెండి నాణాలు, బిస్కెట్లు, వెండి ఇటిఎఫ్‌లు కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు ప్రస్తుతం భారీ నష్టాల్లో కూరుకుపోయారు. మరోవైపు పండుగల సీజన్ దగ్గరపడుతున్నా డిమాండ్ లేకపోవడంతో వ్యాపారుల వద్ద సరుకు నిల్వలు పేరుకుపోతున్నాయి. భారత బులియన్ డీలర్లు, రిఫైనరీలు విదేశాల నుంచి ఆర్డర్ చేసిన దాదాపు 2,000 టన్నుల వెండి ప్రస్తుతం భారత్‌కు వస్తోంది.
భారత్ ప్రతి సంవత్సరం సుమారు 7,000 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ కొత్త నిల్వలను కొనేవారు లేక గోదాముల్లోనే ఉండిపోతాయని డీలర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జూలియస్ బేయర్ నెకస్ట్ జనరేషన్ రీసెర్చ్ హెడ్ కార్సెన్ మెన్కే మాట్లాడుతూ, స్పెక్యులేషన్ వల్ల పెరిగిన మార్కెట్ పతనాన్ని ఇన్వెస్టర్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. పరిశ్రమల్లో వెండికి బదులుగా అల్యూమినియం, రాగి వినియోగం పెరగడం, చైనా సోలార్ రంగా నుంచి డిమాండ్ తగ్గడం ధరలపై ప్రభావం చూపుతోందన్నారు. పబ్లిక్ గోల్ బులియన్ గ్లోబల్ బిజినెస్ హెడ్ చిరాగ్ షేత్ స్పందిస్తూ, అమెరికా, ఇరాకన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం సోలార్, సెమీకండక్టర్, ఈవీ పరిశ్రమలపై దెబ్బకొట్టిందని తెలిపారు. ఈ యుద్ధం ముగిస్తే తప్ప అంతర్జాతీయంగా వెండి ధర 100 డాలర్లు దాటడం కష్టమని అభిప్రాయపడ్డారు. ప్రెషియస్ మెటల్స్ రిఫైనర్స్ ఫోరమ్ ప్రెసిడెంట్ జేమ్స్ జోస్ ప్రకారం, కొత్త ఇన్వెస్టర్లు రాకపోవడంతో అంతర్జాతీయంగా, దేశీయంగా రిఫైనరీలు, డీలర్లు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇన్వెస్టర్లు ఒకేసారి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ తరహాలో ప్రతి నెలా వెండి ఇటిఎఫ్‌లను కొనుగోలు చేయడం ఉత్తమం అని విశ్లేషకులు సూచిస్తున్నారు.











