అమెరికా 9 పాయింట్లకు స్పందనగా 14 పాయింట్లతో ఇరాన్ ప్రతిపాదనలు

తాత్కాలిక సంధికి నిరాకరణ

హర్మూజ్ దిగ్బంధనం ఎత్తివేత, వివిధ దేశాల్లో స్తంభింపజేసిన ఆస్తుల విడుదల

లెబనాన్‌పైనా యుద్ధం నిలిపివేత సహా పలు షరతులు విధింపు

బంతి అమెరికా కోర్టులో ఉందని ప్రకటన

ఇరాన్ ప్రతిపాదనలపై అధ్యక్షుడు ట్రంప్ పెదవి విరుపు

అణ్వాయుధాలపై స్పష్టమైన హామీ లేదని అసంతృప్తి

లాహోర్: పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నిలిచిపోయిన శాంతి చర్చలను తిరిగి ముందుకు తీసుకెళ్లేందుకు ఇరాన్ అమెరికాకు 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. ఘర్షణను ముగించేందుకు అమెరికా నుంచి వచ్చిన 9 పాయింట్లకు స్పందనగా ఇరాన్ ఈ 14 పాయింట్లతో తాజా ప్రతిపాదనలు చేసింది. ఇందులో లెబనాన్‌తో సహా అన్ని విధాలుగా యుద్ధాన్ని ముగించాలని టెహ్రాన్ పిలుపునిచ్చింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ పొడిగింపునను ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక సంధికి బదులుగా.. 30 రోజుల్లోగా యుద్ధం శాశ్వతంగా ముగించేలా సమగ్ర పరిష్కారాన్ని కోరింది. దీనితో పాటు తమపై మళ్లీ దాడులు చేయకుండా భద్రతా హామీలు ఇవ్వాలని, సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

వివిధ దేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని, తమపై విధించిన ఆంక్షలను కూడా ఎత్తేయాలని ప్రతిపాదనల్లో ప్రస్తావించింది. హార్మూజ్ జలసంధిలో దిగ్భంధనాన్ని ఎత్తేయడం, యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి. ఈ పరిణామాలపై అవగాహన ఉన్న ఓ సీనియర్ అధికారి ఆదివారం దీన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ తాజా ప్రతిపాదనపై ఇంకా సంతృప్తిగా లేనట్లు తెలిపారు. టెహ్రాన్ అణ్వాయుధాల అభివృద్ధిని పూర్తిగా నిరోధించే స్పష్టమైన హామీలు లేని ఏ ఒప్పందాన్నీ వాషింగ్టన్ అంగీకరించే అవకాశం లేదని ఆయన సంకేతాలు ఇచ్చారు.

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ యుద్ధం ఏప్రిల్ 8 నుంచి నిలకడగా ఉంది. అనంతరం ఇస్లామాబాద్‌లో ఒక విడత శాంతి చర్చలు జరిగాయి. తాజా ప్రతిపాదనలో తక్షణ ఉద్రిక్తతల నియంత్రణను, ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న దీర్ఘకాలిక వివాదం నుంచి వేరు చేసి ముందుకు సాగాలని ఇరాన్ సూచించినట్లు ఆ అధికారి తెలిపారు. ఈ ప్రణాళికలో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయని చెప్పారు. మొదటిది అత్యవసర ఉద్రిక్తతల తగ్గింపుపై దృష్టి సారిస్తోంది. హార్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంది. అయితే దీనికి ప్రతిగా అమెరికా తన సైనిక ఉనికిని తగ్గించడంతో పాటు ఇరాన్ చమురు ఎగుమతులపై ఉన్న ఆర్థిక ఆంక్షలను సడలించాలి అని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ చమురు, వాయు రవాణాలో దాదాపు ఐదో వంతు హార్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల కారణంగా సముద్ర రవాణా తీవ్రంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో పాటు అనేక దేశాల్లో ఇంధన కొరత నెలకొంది. ప్రధాన చర్చలకు ముందుగా పరస్పర నమ్మకాన్ని పెంపొందించే చర్యలు అవసరమని టెహ్రాన్ భావిస్తున్నట్లు అధికారి తెలిపారు. రెండో అంశంగా సముద్ర వాణిజ్యం, చమురు సరఫరాల పునరుద్ధరణను అణు చర్చల నుంచి వేరు చేయాలని ఇరాన్ కోరుతోంది. అణు కార్యక్రమంపై ఎలాంటి కట్టుబాట్లకైనా ముందుగా ఆర్థిక సాధారణీకరణ జరగాలని టెహ్రాన్ అభిప్రాయపడుతోంది అని ఆయన వెల్లడించారు.

అమెరికాతో నిలిచిపోయిన శాంతి చర్చలను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ సమర్పించిన తాజా ప్రతిపాదనలో అణు కార్యక్రమానికి సంబంధించిన షరతులతో కూడిన సడలింపు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలో మూడో ప్రధాన అంశం అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైందని సంబంధిత అధికారి తెలిపారు. శాంతియుత అవసరాల కోసం అణుశక్తిని వినియోగించుకునే హక్కుపై తమ వైఖరిని పునరుద్ఘాటించిన ఇరాన్, యురేనియం శుద్ధీకరణ పరిమితులు, మరింత కఠినమైన పర్యవేక్షణ విధానాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే ఇందుకు ప్రతిగా ఆంక్షల ఉపశమనంపై స్పష్టమైన హామీలు కలిగిన విసృ్తత ఒప్పందం ఉండాలని కోరుతోంది అని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం పౌర అవసరాల కోసం అణు సాంకేతికత అభివృద్ధి చేసుకునే హక్కును అధికారికంగా గుర్తించాలని ఇరాన్ కోరుతున్నట్లు మరో వర్గం తెలిపింది. అంతేకాకుండా ఈ అంశంపై కుదిరే ఒప్పందం దీర్ఘకాలం అమల్లో ఉండేలా, ఏకపక్షంగా ఉపసంహరించుకోలేని విధంగా హామీలు ఇవ్వాలని టెహ్రాన్ కోరుతున్నట్లు సమాచారం.

బంతి అమెరికా కోర్టులోనే.. ఇరాన్

భవిష్యత్తులో సైనిక చర్యల ప్రమాదంపై టెహ్రాన్‌లో ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో భద్రతా హామీలను కూడా ఈ ప్రతిపాదనలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. అమెరికా లేదా దాని ప్రాంతీయ మిత్రదేశాలు మళ్లీ దాడులకు పాల్పడకుండా నిరోధించే హామీలు ఇవ్వాలని ఇరాన్ కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పాకిస్థాన్ పాత్ర కేవలం మధ్యవర్తిత్వ సహకారానికే పరిమితమైందని అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్ సందేశాల మార్పిడికి వేదికగా వ్యవహరిస్తోందని, పరోక్ష చర్చలకు ఆతిథ్యం ఇవ్వడంపై అవకాశాలను పరిశీలిస్తోందని వెల్లడించారు.

ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చలు ఖరారు కాలేదని, అయితే అమెరికా-ఇరాన్ మధ్య ప్రాథమిక అవగాహన కుదిరితే ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగే అవకాశాన్ని ఇరు పక్షాలు పూర్తిగా తిరస్కరించలేదని సమాచారం. ఇరాన్ తాజా ప్రతిపాదనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుతం వారు చేస్తున్న ప్రతిపాదనలతో నేను సంతృప్తిగా లేను అని వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రతిపాదనలో అసంతృప్తికి కారణం ఏమిటని ప్రశ్నించగా, వాళ్లు నేను అంగీకరించలేని విషయాలను కోరుతున్నారు అని ఆయన తెలిపారు.

ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోతే తదుపరి చర్య ఏమిటన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. మనం వెళ్లి వారిపై భారీ దాడి చేసి పూర్తిగా ముగించాలా? లేక ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేయాలా? ప్రస్తుతం ఇవే రెండు మార్గాలు అని వ్యాఖ్యానించారు. అయితే తాను పెద్ద ఎత్తున సైనిక దాడికి వెళ్లాలని ఇష్టపడడం లేదని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. చర్చల్లో ఇరాన్ కొంత పురోగతి సాధించినప్పటికీ, ఆ దేశ నాయకత్వంలో తీవ్ర విభేదాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

మరోవైపు ఇరాన్ అధికారులు మాత్రం తమ తాజా ప్రతిపాదనలో ముందుగా యుద్ధ విరమణకు ప్రాధాన్యం ఇచ్చామని, అనంతరం విసృ్తత రాజకీయ ప్రక్రియకు మార్గం సుగమం చేయాలనేదే తమ ఉద్దేశమని తెలిపారు. వివాదాస్పద అంశాలపై చర్చలు తరువాత జరగాలని వారు స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ, దౌత్యపరమైన పరిష్కారం వైపు వెళ్లాలా, లేక ఘర్షణాత్మక వైఖరిని కొనసాగించాలా అన్నది ఇప్పుడు అమెరికా చేతుల్లో ఉంది అని వ్యాఖ్యానించారు. జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకునే లక్ష్యంతో ఇరాన్ రెండు మార్గాలకూ సిద్ధంగా ఉంది అని ఆయన తెలిపారు.

ఇరాన్-అమెరికా మధ్య ప్రత్యక్ష చర్చల తొలి విడత గత ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ ఆధ్వర్యంలో జరిగింది. అయితే యుద్ధం ముగింపుపై ఇరు దేశాలు ఎలాంటి ఒప్పందానికి రాలేకపోయాయి. ఇరాన్‌కు సమగ్ర ప్రతిపాదన సిద్ధం చేసుకునేందుకు మరింత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వారాల కాల్పుల విరమణను ట్రంప్ గత వారం నిరవధికంగా పొడిగించినట్లు సమాచారం.