మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే నెల 10న ప్రధాని నరేంద్ర మోడీ నగరానికి రానున్న సందర్భంగా బిజెపి సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా విఫలమైనందున ప్రజలు ఆగ్రహంగా ఉన్నందున తమ బహిరంగ సభకు ‘జన ఆగ్రహ సభ’ పేరు పెట్టాలని నిర్ణయించామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై బహిరంగ సభ నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జన ఆగ్రహ సభ వాల్ పోస్టర్‌నూ ఆయన ఆవిష్కరించారు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ మే 10న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు రానున్న సందర్భంగా నగరంలో దాదాపు రూ. 7,700 కోట్ల నుంచి రూ. 8,000 కోట్ల వరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు చెప్పారు.

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న జన ఆగ్రహ సభలో ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు ఆయన తెలిపారు. మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి రావడం విశేషం అని అన్నారు. అదేవిధంగా తాను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేయడం ఆనందంగా ఉందన్నారు. విమానాశ్రయం వద్ద్ద ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం సభా వేదికకు చేరుకుంటారని, రాష్ట్రంలో బిజెపి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు, మహిళలు, యువత, జెన్-జి సహా అన్ని వర్గాల ప్రజలు తమ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా తమ పార్టీకి మద్దతు  పెరుగుతుండగా, దక్షిణాదిలో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి తీసుకునిరావాలని, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.

బిఆర్‌ఎస్ ప్రజల సమస్యలను పూర్తిగా పక్కనపెట్టి, కుటుంబ ప్రయోజనాలకే పరిమితమైపోయిందని ఆయన విమర్శించారు. ఇటువంటి అవకాశవాద రాజకీయాలు ఇక రాష్ట్రంలో పని చేయవని అన్నారు. ప్రజల మధ్య ఉండి, దేశ ప్రయోజనాలను ముందుంచే బిజెపియే అధికారంలోకి రావాలని ప్రజల్లో బలమైన అభిప్రాయం వ్యక్తమవుతోందని ఆయన తెలిపారు. పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. ఆ బిల్లు ఆమోదమైతే మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం పెరిగేది, దక్షిణాది రాష్ట్రాలకు కూడా లాభం కలిగేదని ఆయన తెలిపారు. కానీ కాంగ్రెస్ చర్యల వల్ల దక్షిణ భారతానికి అన్యాయం జరిగిందని రాంచందర్ రావు విమర్శించారు.