తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. నటుడు విజయ్ సీఎం ప్రమాణ స్వీకారం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ప్రచారం జరిగింది. మే 9 ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

అయితే గవర్నర్ కార్యాలయం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. టీవీకేకు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని.. మెజారిటీకి ఇంకా ఇద్దరు సభ్యులు తక్కువని స్పష్టం చేసింది. వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు లేఖలు అందలేదని లోక్ భవన్ వర్గాలు తెలిపాయి.

ఇక ఐయూఎంఎల్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. శనివారం జరిగే కార్యక్రమానికి విజయ్‌ను ఆహ్వానించలేదని గవర్నర్ కార్యాలయం వెల్లడించింది.

చివరి వరకు అవసరమైన సంఖ్య కోసం టీవీకే తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. సీఎం కుర్చీకి కేవలం రెండు అడుగుల దూరంలో విజయ్ ఆగిపోయారనే చర్చ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.