ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత నెల రోజులుగా హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు.

1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ల కోసం సాగించిన ఉద్యమాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. రాజకీయ జీవితంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. మంత్రిగానూ కీలక బాధ్యతలు నిర్వహించారు. కాపు సామాజిక వర్గం హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసింది.

ముద్రగడ మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయం ముగిసిందని పలువురు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాపు ఉద్యమానికి ఆయన చేసిన సేవలను పలువురు ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు.