హైదరాబాద్ గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేయడానికి యత్నించిన భారీ భూ కుంభకోణాన్ని పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేరు బయటకు రావడం సంచలనంగా మారింది.
శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గండిపేట సర్వే నంబర్ 18లోని భూమిని క్రమబద్ధీకరించారంటూ ఫేక్ జీవోలు సృష్టించినట్లు గుర్తించామని తెలిపారు. తహసీల్దార్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడిందన్నారు.
నకిలీ పత్రాలు తయారు చేసిన నిమ్మల రాజేశ్ గౌడ్, వేణుగోపాల్, సాయికిరణ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని వెల్లడించారు.
ఎకరా రూ.3.5 కోట్ల చొప్పున భూమి విక్రయానికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టు ఆదేశాలతో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి బ్యాంక్ పాస్‌బుక్స్, మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ భూ డీల్‌లో రూ.4 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బొల్లా బ్రహ్మనాయుడు ఖాతా నుంచి రెండు విడతల్లో రూ.1.25 కోట్లు బదిలీ అయినట్లు పోలీసులు వెల్లడించారు.












