అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. కారోల్టన్‌లోని ‘కె టౌన్ ప్లాజా’ షాపింగ్ సెంటర్‌లో దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
వ్యాపార లావాదేవీలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. చర్చలు సాగుతున్న వేళ ఓ దుండగుడు ఉద్దేశపూర్వకంగా ఆకస్మికంగా తుపాకీతో కాల్పులు జరపడంవల్ల అక్కడివారు ఒక్కసారిగా పరుగులు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. కాల్పులకు తెగబడిన నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనే దానిపై దర్యాప్తు సాగిస్తున్నారు.











