ఫ్రిస్కో మేయర్ ఎన్నికల వేళ, మేయర్ అభ్యర్థి మార్క్ హిల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన విజన్‌ను ప్రజలతో పంచుకున్నారు. "యునైట్ ఫ్రిస్కో" నినాదంతో ముందుకు సాగుతున్న ఆయన, నగర అభివృద్ధి, ఆర్థిక అవకాశాలు, విద్యా రంగ బలోపేతం, పన్నుల సంస్కరణలు, సామాజిక ఐక్యత వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా భారతీయ-అమెరికన్ సమాజం ఫ్రిస్కో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని పేర్కొంటూ, ప్రతి వర్గానికి సమాన గౌరవం, ప్రాతినిధ్యం, అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నగర భవిష్యత్తు, నాయకత్వం, వ్యాపార వృద్ధి, గృహ మార్కెట్, వలస విధానాలు వంటి అనేక అంశాలపై మార్క్ హిల్ తన ప్రణాళికలను ఈ ప్రత్యేక సంభాషణలో వివరించారు.

ప్రశ్న 1: మార్క్ హిల్ ఎవరు? మీరు ఫ్రిస్కో మేయర్‌గా ఎందుకు పోటీ చేస్తున్నారు?

సమాధానం: నేను 22 సంవత్సరాలుగా ఫ్రిస్కోలో నివసిస్తున్నాను. స్థానిక వ్యాపారవేత్తను, ఫ్రిస్కో ISD బోర్డు అధ్యక్షుడిగా సేవలందించాను. నగర అభివృద్ధి, విద్య, ఆర్థిక అవకాశాల కోసం మేయర్‌గా సేవ చేయాలని నిర్ణయించుకున్నాను.

ప్రశ్న 2: ఫ్రిస్కోలో భారతీయ-అమెరికన్ సమాజం పెద్ద సంఖ్యలో ఉంది. వారికి మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు?

సమాధానం: భారతీయ-అమెరికన్ సమాజం ఫ్రిస్కో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. వారిని కేవలం అంగీకరించడం కాదు, గౌరవించడం, ప్రాతినిధ్యం కల్పించడం, వారి సంస్కృతిని సెలబ్రేట్ చేయడం అవసరం.

ప్రశ్న 3: వేగంగా పెరుగుతున్న ఫ్రిస్కోలో జీవన నాణ్యతను ఎలా కాపాడతారు?

సమాధానం: నగర అభివృద్ధి ఎంత ముఖ్యమో, కమ్యూనిటీ విలువలు కూడా అంతే ముఖ్యం. అందరికీ ఆహ్వానించే, సురక్షితమైన వాతావరణాన్ని కొనసాగిస్తాం.

ప్రశ్న 4: సిటీ కౌన్సిల్ సమావేశాల్లో పెరుగుతున్న విభేదాలు, నెగటివిటీని ఎలా ఎదుర్కొంటారు?

సమాధానం: సమావేశాలు నగర ప్రయోజనాల కోసం జరగాలి. పరస్పర గౌరవం, మర్యాద, సానుకూల చర్చలతో ముందుకు సాగాలి.

ప్రశ్న 5: ఫ్రిస్కోలో ఉన్న ప్రతిభావంతులైన యువత, నిపుణులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు?

సమాధానం: టెక్నాలజీ, AI, మెడికల్, ఫైనాన్స్ రంగాల్లో మరిన్ని కంపెనీలను ఆకర్షించి ఉద్యోగ అవకాశాలను పెంచడమే నా లక్ష్యం.

ప్రశ్న 6: ఆస్తి పన్నుల (Property Taxes) విషయంలో మీ ప్రణాళిక ఏమిటి?

సమాధానం: పన్నుల భారం తగ్గించడానికి కృషి చేస్తాను. రాష్ట్ర నాయకులతో కలిసి పన్ను సంస్కరణలకు మద్దతు ఇస్తాను.

ప్రశ్న 7: వైవిధ్యం (Diversity) ఫ్రిస్కో భవిష్యత్తుకు ఎంత ముఖ్యమని భావిస్తున్నారు?

సమాధానం: వైవిధ్యమే ఫ్రిస్కో విజయానికి ప్రధాన బలం. భిన్న సంస్కృతులు, భిన్న నేపథ్యాల ప్రజలు కలిసి ఎదగడం నగరాన్ని మరింత బలంగా చేస్తుంది.

ప్రశ్న 8: మేయర్ పదవికి మీ అనుభవం ఎలా ఉపయోగపడుతుంది?

సమాధానం: వ్యాపారవేత్తగా, న్యాయవాదిగా, స్కూల్ బోర్డు అధ్యక్షుడిగా, ఎకనామిక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సభ్యుడిగా పనిచేసిన అనుభవం నాకు ఉంది.

ప్రశ్న 9: ఫ్రిస్కో ISD భవిష్యత్తుపై మీ దృష్టి ఏమిటి?

సమాధానం: మంచి విద్యే నగర భవిష్యత్తుకు పునాది. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాను.

ప్రశ్న 10: భారతీయ సంస్కృతిలో మీకు నచ్చే అంశాలు ఏమిటి?

సమాధానం: కుటుంబ విలువలు, విద్యకు ఇచ్చే ప్రాధాన్యత నాకు ఎంతో ఇష్టం. అలాగే బిర్యానీ నా ఫేవరెట్ వంటకాలలో ఒకటి.

ప్రశ్న 11: భారతీయ వ్యాపారాలు, పండుగలకు మీరు మద్దతు ఇస్తారా?

సమాధానం: ఖచ్చితంగా. దీపావళి, హోలీ వంటి వేడుకల్లో పాల్గొన్నాను. భారతీయ వ్యాపారాల అభివృద్ధికి ఎప్పుడూ మద్దతు ఇస్తాను.

ప్రశ్న 12: “యునైట్ ఫ్రిస్కో” అంటే మీకు ఏమిటి?

సమాధానం: ప్రతి ఒక్కరికీ స్వాగతం పలికే, ఐక్యతతో ముందుకు సాగే ఫ్రిస్కో నా కల. విభజన కాదు, కలిసికట్టుగా ఎదగడమే లక్ష్యం.

ప్రశ్న 13: H-1B వీసా, వలసలపై మీ అభిప్రాయం ఏమిటి?

సమాధానం: చట్టబద్ధంగా ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికీ ఫ్రిస్కోలో స్వాగతం. మోసాలను అరికట్టాలి, కానీ చట్టబద్ధ వలసలను గౌరవించాలి.

ప్రశ్న 14: గృహ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో మీ ప్రణాళిక ఏమిటి?

సమాధానం: ఫ్రిస్కోను ఉత్తమ నివాస నగరంగా కొనసాగించడం ద్వారా పెట్టుబడులు, గృహ విలువలను కాపాడవచ్చు.

ప్రశ్న 15: ఫ్రిస్కో ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి?

సమాధానం: సానుకూల నాయకత్వం, అనుభవం, ఐక్యత, ఆర్థిక అభివృద్ధి, విద్యా పురోగతి...ఇవే నా ప్రధాన లక్ష్యాలు. ఫ్రిస్కో భవిష్యత్తును మరింత బలంగా తీర్చిదిద్దేందుకు నేను కట్టుబడి ఉన్నాను.