తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026 మేలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన 21 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ భారీ ఊరట కల్పించారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను స్పీకర్ మంగళవారం తిరస్కరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించగా, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశ్వాస పరీక్ష సమయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడి, 21 మంది ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా ఓటేశారు. దీనిపై పార్టీ విప్‌ను ధిక్కరించారని పేర్కొంటూ అనర్హత చర్యలు కోరినా, ఎమ్మెల్యేల వివరణతో స్పీకర్ ఏకీభవించారు. దీంతో రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకోగా, పళనిస్వామికి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలినట్లైంది.












