ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సోమవారం సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్‌లో ఈ ముగ్గురు నేతలు పక్కపక్కనే కూర్చున్న ఫొటో వైరల్‌గా మారింది.

ఇప్పటికే శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ), ప్రధాని మోదీ మధ్య వరుస భేటీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫొటోకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్సీపీ (ఎస్పీ) ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో కొనసాగుతున్నప్పటికీ.. ఆ పార్టీ నేతలు కేంద్రంతో జరుపుతున్న చర్చలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఇదిలా ఉంటే.. సోమవారం ఉదయమే ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన మొత్తం ఎనిమిది మంది లోక్‌సభ ఎంపీలు సుప్రియా సూలే నేతృత్వంలో ప్రధాని మోదీని కలిశారు. మహారాష్ట్రకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కరువు, సాగునీరు, నదుల అనుసంధానం, రైల్వేలు, రైతు రుణమాఫీతో పాటు నియోజకవర్గాల సమస్యలపై ప్రధానికి వినతిపత్రం అందించారు.

పుణె-నాసిక్ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, రైతు రుణమాఫీ అంశాలను కూడా ప్రస్తావించినట్లు ఎన్సీపీ ఎంపీ అమోల్ కోల్హే తెలిపారు. పార్లమెంట్‌లో అంతరాయాల కారణంగా సమస్యలను నేరుగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు.