ఎయిర్ ఇండియా ఫుకెట్‌–ఢిల్లీ విమాన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆగస్టు 4న ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తు కోల్పోయిన విమానానికి పైలట్‌-ఇన్‌-కమాండ్‌ (PIC)గా ఉన్న పైలట్‌కు నిర్వహించిన నిర్ధారణ డ్రగ్‌ టెస్ట్‌లో నిషేధిత పదార్థం ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని పరిణామాలతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు వెల్లడించినట్లు రాయిటర్స్‌ సహా పలు మీడియా సంస్థలు తెలిపాయి.

విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి పలువురు గాయపడ్డారు. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్‌ అయింది. ఘటన అనంతరం పైలట్లకు తప్పనిసరి సైకోయాక్టివ్‌ సబ్‌స్టెన్స్‌ స్క్రీనింగ్‌ నిర్వహించగా.. కెప్టెన్‌ పరీక్షలో తొలుత ‘నెగెటివ్‌ కాదు’ అనే ఫలితం వచ్చింది. దీంతో నిర్ధారణ పరీక్షకు నమూనాను పంపించారు.

తాజాగా వచ్చిన నిర్ధారణ పరీక్షలో మారిజువానా (గంజాయి) ఉన్నట్లు తేలినట్లు సమాచారం. అయితే ఈ ఫలితాన్ని ఎయిర్‌ ఇండియా లేదా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించలేదు. ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (AAIB) దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తికాకముందే తుది నిర్ణయాలకు రావద్దని AAIB సూచించింది.

ఈ పరిణామంపై కేంద్ర పౌర విమానయాన శాఖ సీరియస్‌గా స్పందించింది. ఎయిర్‌ ఇండియా సీఈఓను అధికారులు సమావేశానికి పిలిపించి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. పైలట్ల డ్రగ్‌ టెస్టింగ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసే అంశాన్ని కూడా డీజీసీఏ పరిశీలిస్తున్నట్లు సమాచారం.