నేపాల్‌లో వరదల కారణంగా చిక్కుకుపోయిన 21 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా తమిళనాడుకు చెందిన వారిగా కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వారిని మంత్రులు కలిశారు. అనంతరం వారిని స్వస్థలాలకు పంపించినట్లు అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. నేపాల్‌లోని త్రిశూలి హైడ్రో పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను కూడా రక్షించినట్లు వెల్లడించారు.

అయితే నేపాల్‌లో 320 మంది భారతీయులు, 100 మంది ఎన్నారైలు గల్లంతైనట్లు తెలిపారు. వీరంతా కైలాస్ మానస సరోవర యాత్రకు వెళ్లినవారే అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. చైనా వైపు టిబెట్‌లో 400 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారితో భారత రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని.. త్వరలో వారందరినీ భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.