స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వాట్సాప్, ఎస్ఎంఎస్, ఇ-మెయిల్, సోషల్ మీడియా ద్వారా వచ్చే నకిలీ శుభాకాంక్షల సందేశాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశభక్తి భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అనుమానాస్పద లింకులు పంపి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దొంగిలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నకిలీ సందేశాల్లో ఉచిత గిఫ్ట్‌లు, క్యాష్‌బ్యాక్, షాపింగ్ వౌచర్లు, మొబైల్ రీచార్జ్‌లు లేదా ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవ గ్రీటింగ్ కార్డులు అందిస్తామని పేర్కొంటూ లింకులు పంపుతున్నారని అధికారులు తెలిపారు. అలాంటి లింకులపై క్లిక్ చేస్తే ఫిషింగ్ వెబ్‌సైట్లకు మళ్లించే అవకాశం ఉండటంతో పాటు మొబైల్ లేదా కంప్యూటర్‌లో హానికర సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాల్లోని లింకులను క్లిక్ చేయవద్దని, అనుమానాస్పద ఫైళ్లు లేదా యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని పేర్కొన్నారు.
అదనంగా టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను ఉపయోగించడం, మొబైల్, కంప్యూటర్‌లను తాజా సెక్యూరిటీ అప్‌డేట్‌లతో ఉంచడం, అనుమానాస్పద సందేశాలను వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా మోసాల నుంచి రక్షణ పొందవచ్చని సైబర్ నిపుణులు తెలిపారు









