టీ20 క్రికెట్ చరిత్రలో టీనేజర్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ పేరిట ఉండేది. గుర్బాజ్ 52 ఇన్నింగ్స్‌లలో 90 సిక్సర్లు కొట్టగా, వైభవ్ కేవలం 26 ఇన్నింగ్స్‌లలోనే 94 సిక్సర్లతో ఆ రికార్డును అధిగమించాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ఈ ఘనత సాధించడం విశేషం.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ తన బ్యాట్‌తో విరుచుకుపడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే శతకం బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆయన 12 భారీ సిక్సర్లు బాదాడు. తద్వారా ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయుడిగా మురళీ విజయ్ రికార్డును చెరిపివేశాడు. 40 బంతుల కంటే తక్కువ వ్యవధిలో రెండు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా ఆయన నిలిచాడు.













