అమెరికాలో ప్రముఖ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించింది. సంస్థ కార్యకలాపాలను మరింత సులభతరం చేయడం కోసం దాదాపు 1,000 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. కొత్త సీఈఓ జాన్ ఫర్నర్ నేతృత్వంలో టెక్నాలజీ ఆధారిత వ్యూహాలపై వాల్‌మార్ట్ దృష్టి పెట్టినట్లు సమాచారం. అధిక ఆదాయం కలిగిన కస్టమర్లను ఆకర్షించడం, డెలివరీ సేవలు మరియు మార్కెట్‌ప్లేస్ వ్యాపారాన్ని విస్తరించడం లక్ష్యంగా సంస్థ ముందుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో సంస్థ గ్లోబల్ టెక్నాలజీ హెడ్ సురేష్ కుమార్, గ్లోబల్ ఏఐ యాక్సిలరేషన్ హెడ్ డేనియల్ డాంకర్ ఉద్యోగులకు మెమో జారీ చేశారు. పనుల నిర్వహణను సులభతరం చేయడం, బాధ్యతలను స్పష్టంగా కేటాయించడం, అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాలను పునర్వ్యవస్థీకరించడం జరుగుతోందని తెలిపారు. కొంతమంది ఉద్యోగులకు ఇతర వాల్‌మార్ట్ కార్యాలయాలకు మారితే ఉద్యోగాలు కొనసాగించే అవకాశం కూడా ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఈ లేఆఫ్స్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణం కాదని వాల్‌మార్ట్ స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఆపరేషనల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగమేనని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాల్‌మార్ట్‌లో సుమారు 21 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జనరల్ మోటార్స్, గిట్‌ల్యాబ్ వంటి సంస్థలు కూడా ఉద్యోగాల కోతలు ప్రకటించాయి.














