అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కెనడాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ.. లేక్ ఒంటారియో పేరును ‘లేక్ అమెరికా’గా మార్చే ఆలోచనలో ఉన్నామని ట్రంప్ ప్రకటించారు.
కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌తో ఇక పెద్దగా వ్యాపారం ఉండదని పేర్కొంటూ.. ఈ పేరు మార్పును సమర్థించుకున్నారు. అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై 50 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదం మరింత ముదిరింది.
ఇదే సమయంలో ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్‌పైనా ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని.. కెనడా నేతలు అమెరికా ప్రతిపాదనలకు అనుగుణంగా నడుచుకోకపోతే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇప్పటికే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చాలని ట్రంప్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో లేక్ ఒంటారియో పేరును మార్చుతామంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
అయితే.. లేక్ ఒంటారియో పేరు అమెరికా, కెనడా ఏర్పాటుకు ముందే చరిత్రలో ఉంది. ఈ పేరు స్థానిక ఆదివాసీ పదం నుంచి వచ్చిందని, దానికి ‘అందమైన నీరు’ లేదా ‘గొప్ప సరస్సు’ అనే అర్థాలు ఉన్నాయని భావిస్తున్నారు.









