క్వుస్రా, వెస్ట్ బ్యాంక్: వెస్ట్ బ్యాంక్‌లోని క్వుస్రా గ్రామంలో పాలస్తీనా కుటుంబాల ఇళ్లను చుట్టుముట్టి ముట్టడి చేస్తున్న తీవ్రవాద ఇజ్రాయెల్ స్థిరనివాసులను (సెట్టిలర్లు) బహిరంగంగా ఖండించాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై ఒత్తిడి తెస్తోంది. వారం రోజులుగా పలువురు పాలస్తీనీయులు తమ ఇళ్లలోనే చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి మైక్ హకబీ, ఈ దాడులకు పాల్పడుతున్న వారిని "ఇజ్రాయెల్ ఉగ్రవాదులు"గా అభివర్ణించారు. ముట్టడికి గురైన కుటుంబాల్లో ఒకటి పాలస్తీనా-అమెరికన్ కుటుంబమని తెలిసిన తర్వాత అమెరికా మరింత తీవ్రంగా స్పందించినట్లు సమాచారం.
ఘటన నేపథ్యంలో ఇజ్రాయెల్ అదనపు భద్రతా బలగాలను గ్రామానికి పంపింది. కొంతమంది సెట్టిలర్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలను తొలగించినప్పటికీ, స్థానికులు, మానవ హక్కుల సంస్థల ప్రకారం బెదిరింపులు, ముట్టడి కొనసాగుతున్నాయి. దీంతో వెస్ట్ బ్యాంక్‌లో పెరుగుతున్న సెట్టిలర్ హింసపై అంతర్జాతీయ ఆందోళనలు మరింత పెరిగాయి.
ఈ ఘటనపై ప్రధాని నెతన్యాహూ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. పాలస్తీనా పౌరుల భద్రతకు హామీ ఇవ్వడంతో పాటు తీవ్రవాద సెట్టిలర్ల చర్యలను ఖండించాలని అమెరికా ప్రభుత్వం కోరుతున్నట్లు సమాచారం.












