ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ వారంలో ఇది ఉత్తర కొరియా చేపట్టిన రెండో క్షిపణి ప్రయోగం. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఉత్తర కొరియా తీర ప్రాంతం నుంచి క్షిపణిని ప్రయోగించినట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది.
ఈ క్షిపణి జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) సమీపంలో సముద్రంలో పడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రయోగంపై ఉత్తర కొరియా నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు.. ఆగస్టు 17 నుంచి అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించనున్నాయి. ప్రతి ఏడాది నిర్వహించే ఈ విన్యాసాలను తమపై దాడికి ముందస్తు సన్నాహకంగా ఉత్తర కొరియా అభివర్ణిస్తోంది.
అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ముందు తమ సైనిక సామర్థ్యాన్ని చాటుకునేందుకే ఉత్తర కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తోంది.












