జింబాబ్వేలోని కరీబా సరస్సులో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడటంతో సుమారు 44 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది 67 మందిని రక్షించారు.
టికెట్ల విక్రయాల ఆధారంగా ప్రమాద సమయంలో ఐదుగురు సిబ్బందితో కలిపి 114 మంది పడవలో ఉన్నట్లు జింబాబ్వే ప్రొటెక్షన్ యూనిట్ తెలిపింది. టికెట్ అవసరం లేని వయస్సులోపు పిల్లలు ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే పడవ సామర్థ్యం 90 మందికే పరిమితం కాగా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అనుమానం వ్యక్తం చేసింది.
గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి అసలు కారణం, గల్లంతైన వారి ఖచ్చితమైన సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
జింబాబ్వే–జాంబియా సరిహద్దులో కరీబా సరస్సు ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కరీబా పట్టణానికి రాకపోకలు సాగించేందుకు ఈ పడవలను ఉపయోగిస్తుంటారు.












