హాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'Spider-Man: Brand New Day' సినిమాకు భారతీయ ప్రేక్షకులను మరింత చేరువ చేసేందుకు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా కొత్త ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఇందులో హర్యాన్వీ ఇండీ సంగీత ద్వయం బంజారే రూపొందించిన 'బర్‌సాత్' పాటను ఉపయోగించి పీటర్ పార్కర్ భావోద్వేగ ప్రయాణాన్ని చూపించింది.

ఈ పాటలో 'Spider-Man: No Way Home' ముగింపులో ఎంజే తనను గుర్తుపట్టకపోవడంతో పీటర్ ఎదుర్కొనే ఒంటరితనం, ప్రేమవేదన, త్యాగాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో కూడా పీటర్ తన కొత్త జీవితాన్ని, కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితిని చూపించగా, 'బర్‌సాత్' ఆ భావోద్వేగాలను మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేస్తోంది.

ఈ పాటను రూపొందించిన బంజారే సభ్యులు సుమిత్ మరియు అనుజ్, తమ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ప్రేమవేదన, భావోద్వేగాల నుంచే 'బర్‌సాత్' పుట్టిందని తెలిపారు. స్పైడర్‌మ్యాన్ ట్రైలర్ చూసిన వెంటనే పీటర్ పార్కర్ కథ తమ పాటతో ఎంతో దగ్గరగా అనిపించిందని వారు చెప్పారు. ఈ సహకారంతో హర్యాన్వీ సంగీతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు.

స్పైడర్‌మ్యాన్ సినిమాల సంగీతానికి తాము చాలా కాలంగా అభిమానులమని, ముఖ్యంగా టామ్ హాలండ్ నటించిన స్పైడర్‌మ్యాన్ సిరీస్, సంగీత దర్శకుడు మైఖేల్ జియాకినో అందించిన నేపథ్య సంగీతం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని బంజారే వెల్లడించారు.

'Spider-Man: Brand New Day' చిత్రం భారత్‌లో జూలై 30ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కొత్త ప్రమోషనల్ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో మార్వెల్ అభిమానులను ఆకట్టుకుంటోంది.