మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కే.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మెగా 158 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రియమణి, బండ్ల గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు టీజర్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే అంతకంటే ముందే మెగాస్టార్ తనదైన శైలిలో టైటిల్‌పై క్లూ ఇచ్చేశారు.
చిరంజీవి ‘చిరు లీక్స్’ పేరుతో తన సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకోవడం తెలిసిందే. తాజాగా ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న చిరంజీవిని మెగా 158 టైటిల్ గురించి యాంకర్ అడిగారు. దీనికి సమాధానంగా మైక్ తీసుకున్న చిరు.. తమన్‌ను ఉద్దేశించి “సేమ్ టైటిల్.. కదిరి లాగా...” అంటూ చెప్పి మధ్యలోనే ఆపేశారు.
దీంతో మెగా 158 సినిమాకు ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నారనే ప్రచారం ఊపందుకుంది. చిరంజీవి ఇచ్చిన ఈ చిన్న క్లూతో టైటిల్ దాదాపుగా రివీల్ అయినట్టేనని అభిమానులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే గతంలో ఈ సినిమాకు ‘కాకాజీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ఏ టైటిల్‌ను ప్రకటిస్తారో చూడాలి.












