సామాజిక సమస్యల ఆధారంగా రూపొందిన 'ది ఇండియా స్టోరీ' సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్‌లో ఆహార కల్తీ, పంటల్లో అధికంగా వాడుతున్న రసాయనాలు, వాటి వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని ప్రధానాంశంగా చూపించారు.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పాడే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కోర్టు నేపథ్యంలో సాగే కథలో ప్రజారోగ్యానికి సంబంధించిన కీలక అంశాలపై పోరాటాన్ని దర్శకుడు చూపించే ప్రయత్నం చేసినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.

చెట్టన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాగర్ బి. షిండే నిర్మించారు. ఆహారంలో కల్తీ, పురుగుమందుల దుర్వినియోగం, వాటి వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేలా కథను రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది.

టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. సమాజానికి ఉపయోగపడే అంశాలను ప్రధానంగా తీసుకుని సినిమాలు రావడం అభినందనీయమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న 'ది ఇండియా స్టోరీ' జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.