తమిళ సినీ జగత్తును శోకసంద్రంలో ముంచేసిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన కడసారి దర్శనం కోసం చెన్నైలోని నివాసానికి ప్రముఖుల రాకపోకలు కొనసాగుతున్నాయి.
భారతీరాజా(84) మరణ వార్త తెలిసిన వెంటనే విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన నేరుగా భారతీరాజా నివాసానికి చేరుకుని పార్థీవదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతీరాజా పార్థీవదేహంపై తలవాల్చి విజయ్ భావోద్వేగానికి లోనైన దృశ్యాలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.
భారతీరాజా కుటుంబ సభ్యులను పరామర్శించిన విజయ్, ఆయన మృతి భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. తమిళ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అసమాన సేవలకు గౌరవ సూచకంగా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
ఇదే సమయంలో ఎం.కె. స్టాలిన్, రాధికా, సూర్య తదితర ప్రముఖులు భారతీరాజా నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.
మరోవైపు, Tamil Film Active Producers Association తమ వ్యవస్థాపక అధ్యక్షుడైన భారతీరాజాకు ప్రభుత్వ గౌరవ వందనం కల్పించాలని సీఎం విజయ్‌ను కోరగా, ఆ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఆయన అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతకుముందు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ తదితర ప్రముఖులు కూడా భారతీరాజాకు నివాళులర్పిస్తూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు













