దర్శకుడు ఎంఎస్ రాజు తెరకెక్కించిన సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ 'అగధ' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను అందుకుంటోంది. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సాధారణ హారర్ చిత్రాలకు భిన్నంగా మిస్టరీ, పురాణ అంశాలు, సైకాలజికల్ థ్రిల్‌ను మేళవించి తెరకెక్కించారని ప్రశంసిస్తున్నారు.

సినిమాలోని గుహ సన్నివేశాలు, అడవి నేపథ్యం, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ప్రేక్షకులు పేర్కొంటున్నారు. థియేటర్‌లో ఈ సన్నివేశాలు మరింత ఉత్కంఠను కలిగిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా "కాలయంత్రం" క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారిందని ప్రేక్షకులు చెబుతున్నారు. విభిన్నంగా తెరకెక్కించిన ఈ క్లైమాక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని, సినిమా ముగిసిన తర్వాత కూడా గుర్తుండిపోయేలా ఉందని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కామాక్షి భాస్కర్ల నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. కొన్ని సన్నివేశాలు మరింత వేగంగా ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ, మొత్తం మీద 'అగధ' హారర్ ప్రేమికులను ఆకట్టుకునే చిత్రంగా నిలిచిందని నెటిజన్లు పేర్కొంటున్నారు.