తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో వైద్య సేవలు, రవాణా, పోలీసుల భద్రతకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గురువారం సాయంత్రం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్య, రవాణా, పోలీసు విభాగాల అధికారులతో అదనపు ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ కుమారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందుబాటులో ఉంచనున్న వైద్య సదుపాయాలను వివరించారు.
తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, అపోలో కార్డియాక్ సెంటర్లు 24 గంటలు నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తాయని తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2, గాలి గోపురం, ఏటీసీ, కల్యాణకట్ట, పీఏసీ-5 ప్రాంతాల్లో 6 డిస్పెన్సరీలు, పీఏసీ-2, భాష్యకార్ల సన్నిధి, అలిపిరి రాజగోపురం, 1500 మెట్టు, ఏడో మైలు, శ్రీవారి మెట్టు 1200 మెట్టు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, శ్రీవారి ఆలయం, నారాయణగిరి షెడ్లు, దర్శన క్యూలైన్లలో 10 ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా రామ్ భగీచా, శిలాతోరణం, పాపవినాశనం, శ్రీవారి సేవా సదన్, శ్రీవారి మెట్టు, అలిపిరి పాదాల మండపం వద్ద 6 నూతన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. కృష్ణతేజ సర్కిల్ నుంచి గోగర్భం సర్కిల్ వరకు ఒక మొబైల్ క్లినిక్ కూడా అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న 11 మంది వైద్యులు, 139 మంది పారా మెడికల్ సిబ్బందికి అదనంగా 75 మంది వైద్యులు, 60 మంది పారా మెడికల్ సిబ్బందిని బ్రహ్మోత్సవాల సమయంలో అందుబాటులో ఉంచనున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం తిరుమలలో మొత్తం 16 అంబులెన్సులు ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే వైద్య సేవలు అందించాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన మందులను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
మాడ వీధుల్లో భక్తులకు వైద్య సహాయం అవసరమైన సందర్భాల్లో పోలీసుల సమన్వయంతో వారిని సురక్షితంగా, వేగంగా ఆసుపత్రికి తరలించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో మాడ వీధుల్లో అంబులెన్సులకు తక్షణ క్లియరెన్స్ లభించేలా చర్యలు తీసుకోవాలని తిరుమల డీఎస్పీ శ్రీ విజయ శేఖర్ను కోరారు. అంబులెన్స్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి అత్యవసర సమయాల్లో క్రమశిక్షణతో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రవాణా విభాగం జీఎం శ్రీ రామును అదనపు ఈవో ఆదేశించారు. ఈ సమావేశంలో వీజీఓ శ్రీ సురేంద్ర, అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.









