ఐపిఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్.. విరాట్ కోహ్లీ మధ్య చిన్న గొడవ జరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం హెడ్‌కి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి కూడా విరాట్ ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు తనని ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారని హెడ్ భార్య.. జెస్సికా హెడ్ ఆస్ట్రేలియన్ మీడియాతో అన్నారు.

‘వరల్డ్ కప్ విజయం తర్వాత ఎలాగైతే వేధింపులు ఎదురయ్యాయో.. ప్రస్తుతమూ అలాంటి వేధింపులే వస్తున్నాయి. నేను నిద్ర లేచే సరికి నా సోషల్‌మీడియా ఖాతాలు కామెంట్లతో హోరెత్తుతున్నాయ. నాకేమీ సమస్య లేదు. బాగానే ఉన్నాను. కానీ వారు నా స్నేహితులు, కుటుంబసభ్యులనూ వేధింపులకు గురి చేస్తున్నారు’ అని జెస్సికా తెలిపారు. ఇటీవల కాలంలో భారత్‌పై ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత కూడా ఇలాంటి వేధింపులు కొనసాగాయని.. 2023 వన్డే వరల్డ్ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వైనల్, 2024 బాక్సింగ్ డే టెస్ట్ కూడా ఉన్నాయని అమె వాపోయారు. ఈ వేధింపులలో గతంలో తమ చిన్న కుమార్తెను ఉద్దేశించి ఆందోళన కలిగించే బెదిరింపులు కూడా ఉన్నాయని ఆరోపించారు.