
తెలుగు ఉభయ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రలో మాట్లాడే జీవన భాష. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కూడా ఎక్కువగా వాడుకలో ఉంది. ఉర్దూ భాష ప్రాముఖ్యం తెలుగు సాహిత్యం పై చెప్పుకోదగ్గదిగానే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఇది మరింత ఎక్కువ. తెలంగాణలోని సామాన్య జనసమూహం ఉర్దూ పదాలను దైనందిన జీవితంలో తరచచు వాడుతుంటారు. వ్యహారిక భాషలో మిళితమైన ఉర్దూ పదాలు తెలంగాణ సాహిత్యంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్దాక కవితలు, కథలు, నవలలు, జానపద పాటలలో, తెలంగాణ నేపథ్యం గల సినిమాలలో మరింత ఎక్కువగా చోటుచేసుకున్నాయి.
మిర్జా గాలీబ్ కవిత్వాన్ని తెలుగులో దాశరథి క్రిష్ణమచార్య గారు ‘గాలిబ్ గీతాలు’ గా అనువాదించారు. ఉదాహరణకు : నేను మరణించిన నా ఇంటిలోన మిగిలె/ప్రియసీ చిత్ర పటములు లేఖలంతె(A few images and a few letters from sweet hearts/Those were the things found at home after my death) ప్రతిది సులభమ్ముగా సాధ్య పడదు లెమ్ము/నరుడు నరుడౌట ఎంతో దుష్కరము సుమ్ము. (It is impossible that every work is easy/For a man to become a man is not at all easy)
మఖ్దూమ్ మొహియొద్దీన్ ఉర్దూలో రాసిన కొన్ని పాటలను దాశరథి, గజ్జల మల్లారెడ్డి, సి.నారాయణారెడ్డి తెలుగులోకి అనువదించారు. తెలుగు పాఠకులు మఖ్దూమ్ కవిత్వాన్ని మెచ్చుకొన్నారు. ఆస్వాదించారు. మీర్ తఖి మీర్, భారతదేశపు చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ కవితలను కూడా వివిధ రచయితలు తెలుగులోకి అనువాదించారు. జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత సి.నారాయణ రెడ్డి తెలుగు గజళ్లు రాశారు. మచ్చుకు కొన్ని పాదాలు :
* ఎదుటివాని బలమెంతటిదో గనించకపోతే ప్రమాదమే
గాలేం చేస్తుందనుకోకు అది మూలాలను పెరికేస్తుంది...కటికనిజం పలికే హృదయం లొంగదు సినారె ఏ ఒత్తిడికీ
కవితేం చేస్తుందనుకోకు అది కత్తులనే నరికేస్తుంది.
* కుళ్లిపోయిన వ్యవస్థను పట్టుకు వేళ్లాడితె అది వ్యర్ధమే
కొత్తసృష్టి జరగాలంటె పొటెత్తే ప్రళయం అవసరం
ఎంత కాలమని చీకట్లను తాగేస్తుంటారోయ్ ‘సినారే’
ఎక్కిన మత్తు దిగాలంటే ఎరుపెక్కిన ఉదయం అవసరం.
సినారె గారి తెలుగు గజళ్లు అణిముత్యాల్లాంటివి
ఉర్దూ మాతృభాష కలిగి ఉన్న వాళ్లు, మాట్లాడే వారు, ఉర్దూ భాషను అర్థం చేసుకునే ప్రజలు తెలంగాణ ప్రాంతంలో అధికంగా ఉన్నారు. ఈ ప్రజలు 1949 వరకు నిజాం పాలనలో ఉన్నందున ఇక్కడ ఉర్దూ ప్రభావం చాలా వరకు ఉంది. నేటికీ తెలంగాణలోని అనేక ప్రాంతాలలో ముషైరా(కవి సమ్మేళనాలు) నిర్వహిస్తారు. అందులో తెలుగు,ఉర్దూ కవులు పాల్గొని, వారి వారి కవిత్వాన్ని పఠిస్తారు. ఒకరకంగా ఉర్దూ కవులు తెలంగాణ ప్రాంతంలో తమ తెలుగు కవిత్వ సహచరులను ప్రభావితం చేశారని చెప్పవచ్చు. ఈ ప్రభావం చాలా లోతుగా ఉంది.ఆధునిక తెలంగాణ కవులు సహజంగా ఉర్దూ పదాలను తమ తమ కవితలలో చొప్పించి తమదంటు ఓ శైలిని రూపొందించారు.
* సర్ ఫరోషి కీ తమన్నా ఆజ్ హమారే దిల్ మేం హై
దేఖ్నా హై జోర్ కితనా బాజు యే ఖాతిల్ మేం హై
రాం ప్రసాద్ బిస్మిల్ గజల్ ను అబ్దుల్ వాహెద్ తెలుగీకరించారు. అందులోని కొన్ని ద్విపాదాలు చూద్దాం:
* తిరుగుబాటు కోరికొక్కటే నేడు మనసులో ఉన్నదీ
చూద్దామిక చావ ఎంతో వైరి చేతిలో ఉన్నదీ
జాతిపైన ఆపదొస్తే ధారబొస్తాం రక్తమే
తిరుగుబాటు కోరికొక్కటే నేడు మనసులో ఉన్నదీ
తుఫానులు గుండెనిండా నెత్తురంతా విప్లవం
వెలుగులాగ లక్ష్యమొక్కటే మనకు కంటిలో ఉన్నదీ
వాహెద్ ఒక సుదీర్ఘ గజల్ రాశారు.వందకు పైగా షేర్లను అందులో
పొందుపరిచారు. అదొక ప్రయోగమే! కొన్నింటిని చూద్దాం:
* ఈ చీకటి రాత్రంతా సౌందర్యము లాగున్నది
నీ కురుల సుతిమెత్తని లావణ్యం లాగున్నది
సూర్యులిద్దరుదయిస్తే చూశారా ఎప్పుడైన
కనురెప్పలు తెరచినపుడు చూడలేదు లాగున్నది..
నీకు తోడు నా శ్వాసను అక్కడనే వదిలేశా
నువు సిగలో ముడేసింది నా ప్రాణము లాగున్నది.
జగధాత్రి జగతి ధాత్రి కూడా గజల్ రాశారు. వారి ఓ గజల్ నుండి రెండు ద్విపాదాలు(షేర్లు) :
* చిక్కిలి పై వలపు గులాబి పూసింది నీకోసమె
కనులు వాల్చి నును సిగ్గుల తలచిందీ నీ కోసమె
నీ చిరు నగవే నా నగయని
మధువని గా ఈ జగతిని విరిసిందీ నీ కోసమె.
అరుణ నారదభట్ల:
* ఊహలోని మనసేదో ఊసులు చెప్పుతున్నది
పసిడి ఆశేదో పూవై విచ్చుకున్నది
మతిమాలిన జ్ఞాపకాలు మనలను రాజేస్తూంటే
మధురమైన మరువంలా గతం కవ్విస్తున్నది!
రామ్మోహన్ రావు తుమ్మురి :
* తెలుగు పూల తోటలోకి తేలిరావె తుమ్మెదా
తెలుగుపూల సొగసు చూసి వాలి పోవె తుమ్మెదా
* వేలయేండ్లనుండి వెలుగు తెలుగు నందనమ్ములోన
‘మోహన’ రాగాన పాట పాడరావె తుమ్మెదా
ఎం.నారాయణ శర్మ:
* గదిలో ఒక గొంతుకేదో పాట పాడుతూ ఉంది
సంవేదన గుండెన మూగి స్వరం మీటుతూ ఉంది
నవ్విన ఆ క్షణాలు కరిగి ’ఓ మనా’ యేడుస్తుంటే
నీవు నేను ఒకటేనంటూ చివరి ఘడియ చేరుతూ ఉంది.
భాష ఏదైనా దాని పై పరిసరాల, ఇతర ప్రాంతాల భాషల ప్రభావం ఉంటుంది. మానవుడు సాంఘీక జీవి. సమాజంలో నలుగురితో కలసి జీవిస్తూన్నప్పుడు ఒకరి భాషనొకరు అర్ధం జేసుకోక తప్పదు. మంచి స్నేహం, సౌభ్రాతృతత్వం కొనసాగడానికి ఇదో మార్గం. మానవుడి పుట్టుక నుంచి,అది కొన్ని వేల లక్షల సంవత్సరాలకు పూర్వమైన లేదా అప్పుడప్పుడే పుట్టిన పసికందుడైనా తనకంటూ ఓ భాష ఉంటుంది. ఇద్దరి మధ్య ఓ మాధ్యమంగా పనిచేస్తోంది. భాష ఒకరినొకరు అర్ధం జేసుకోవడానికి దోహదపడుతుంది. ఇద్దరు యువ జంటల మధ్య ఉండే ఆకర్షణ లాంటిదే, ఒక భాష పై మరో భాష ప్రభావం. తెలుగు సాహిత్యం పై ఉర్దూ భాష ప్రభావం కూడా అలాంటిదే.
మన దేశంలోని సంవిధానంలో గుర్తించబడిన భాషలు 22. తెలుగు భాష మాట్లాడేవారి శాతం 6.7. హిందీ మనదేశంలో అధికంగా మాట్లాడే భాష. దానికి దగ్గర్లో నే ఉన్న భాష ఉర్దూ. ఈ రెండు భాషలు అక్క-చెల్లెళ్లుగా ఉంటాయి. ఉర్దూ భారతదేశంలో 4.2% శాతం మాట్లాడుతారు. దక్షిణ భారతదేశంలో ఐదు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉర్దూభాష తెలిసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. తెలుగులో తెలుగు గజల్లు రాయడమే కాదు వీటిని శ్రావ్యంగా పాడుతూ ఎందరివో గుండెలను దోచుకొంటున్నారు. గజల్ రసానాందాన్ని అస్వాదిస్తున్నారు శ్రోతలు. గజల్ లను చదివి ఆనందిచే వారి గురించి వేరేగా చెప్పనవసరం లేదు. గజల్ లను తెలుగులో రాస్తూన్న వారిలో అబ్దుల్ వాహెద్, జగద్ధాత్రి జగతి ధత్రి, అరుణ నారదభట్ల, సి.వి.సురేష్, రాంమోహన్ రావు తుమ్మరి, ఎం.నారాయణ శర్మ మొదలైన వారు. కొత్త తరం యువకులలో గజల్ రాసే వారు బాగానే రాస్తున్నారు.
బహుభాష కోవిదులైన పి.బి.శ్రీనివాస రావు గారి 60 గజల్ లను 2015 లో ప్రభుత్వ ప్రాచ్యలిఖిత గ్రంధాలయం, హైదరాబాద్ వారు ‘గేయ కవితలు’ అన్న శీర్షికతో ప్రచురించారు. శ్రీనివాస రావు గారికి గజల్ లు, భాషలన్నా చాలా ఇష్టం. వారు 8 భాషలలో గజల్ రచనలు చేశారు. వారికి భాషల మీదున్న మమకారం ఏలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఉర్దూ గజల్ లను తెలుగులో, తెలుగు గజల్ లను తెలుగులో చక్కగా శ్రావ్యంగా పాడుతున్నారు. గజల్ శ్రీనివాస్ మరియు జ్యోతిర్మై సుప్రసిద్దులు.
ఒక భారతీయ భాష సాహిత్యం ప్రభావాన్ని మరొకదానిపై అంచనా వేసినప్పుడు, మొహమ్మద్ ఇక్బాల్ చెప్పిన మాటలు మనకు గుర్తుకు వస్తాయి. భారతీయులందరూ గులాబీ తోటలో ఒకే కొమ్మపై పాడుతూన్న పక్షులు. ఉర్దూ కవుల, రచయితల సాహిత్యాన్ని చదవడం వల్ల, వారి వ్యక్తీకరణ, సంక్షిప్తత, గూఢర్ధాలు, గజల్ లోతు, ప్రమాణికలు, అందం, గౌరవాన్ని రాబట్టుకోవ చ్చు. అంతేకాదు, తెలుగు సాహిత్యకారులు ఉర్దూ సాహిత్యంలోని శ్రావ్యత, ఘనత, సంస్కృతిని అభినందించడం అలవర్చుకున్నారు. తెలుగు కవులు తెలుగులో ఇలాంటి కవిత్వం అల్లడంలో ఉర్దూ కవుల వాక్చాతుర్యం, శైలి, ఇతర పద్ధతులను అనుసరించడానికి ప్రయత్నించారు. చాలా వరకు విజయం సాధించారు. ఉర్దూలో విరచిత గజళ్లను అనుకరించి తెలుగులో స్వంతంగా మంచి తెలుగు -గజళ్లులు రాస్తునారు.
- అమ్జద్












