
హ్యామ్ రోడ్ల విధానంలో ప్రభుత్వ ఖజానాకు రూ.2,500 కోట్లు ఆదా
నిర్మాణ పనులను 5శాతం ఎక్సెస్‌కు మించకుండా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం
కేబినెట్ సమావేశంలోనే అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
ఆ మేరకే టెండర్లు 23.5 శాతం ఎక్సెస్ వల్ల భారీ అవకతవకలు జరగబోతున్నాయని ఆరోపించిన హరీశ్‌రావు
వివిధ వేదికల ద్వారా పదేపదే అభ్యంతరం చెబుతూ వచ్చిన బిఆర్‌ఎస్ నేత
అప్రమత్తమైన ప్రభుత్వం
ఏడాదిన్నరగా సాగిన వివాదానికి తెర
మన తెలంగాణ/హైదరాబాద్: హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) విధానంలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం చేపట్టే అంశంపై శనివారం జరిగిన మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో ఏడాదిన్నరగా నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులను 5 శాతానికి మించకుండా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రిమండలి సమావేశంలో అధికారులను ఆదేశించడంతో ఇక ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 2 వేల నుంచి 2 వేల కోట్లు ఆదా కానున్నాయని అంచనా. రాష్ట్ర ఖజానాకు ఇంతటి పెద్ద మొత్తంలో డబ్బు ఆదా కావడానికి పరోక్షంగా దోహదపడిన క్రెడిట్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హారీశ్‌రావుకు దక్కనుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి పిలిచిన టెండర్లలో కాంట్రాక్టర్లు కోట్ చేసిన 23.5 శాతం ఎక్సెస్ వల్ల భారీ కుంభకోణానికి తెరతీసారని హరీశ్‌రావు మొదటి నుంచి ఆరోపిస్తూ వచ్చారు.
మార్చిలో జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాలలో కూడా ఈ అంశాన్ని హరీశ్‌రావు ప్రస్తావించారు. గత ఏడాది అక్టోబర్‌లో హ్యామ్ విధానంలో చేపట్టబోయే 34 ప్యాకేజిలుగా 6,092 కిలో మీటర్ల రోడ్లను రూ.13,౦౦6 కోట్ల వ్యయంతో, అలాగే సుమారు రూ. 8 వేల కోట్ల వ్యయంతో చేపట్టబోయే పంచాయతీరాజ్ రోడ్లను మొత్తంగా సుమారు రూ. 20 వేల కోట్ల వ్యయంతో చేపట్టబోయే రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచింది. అయితే కాంట్రాక్టర్లు ఏకంగా 23.5 శాతం ఎక్సెస్ కోట్ చేశారు. ఐదు శాతం ఎక్సెస్‌తో చేపట్టబోయే పనులను దాదాపు 20 శాతం అథికంగా కోట్ చేయడం వల్ల దాదాపు ఐదు వేల కోట్ల కుంభకోణానికి తెరతీశారని హరీశ్‌రావు ఆరోపించారు. దీనిపై సమ్రగ విచారణకు ఆదేశించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని హరీశ్‌రావు పదే పదే ప్రస్తావించడంతో దీంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. టెండర్లను ఖరారు చేయకుండా నిలుపుదల చేసి కాంట్రాక్టర్లను సమావేశపరిచి అధికంగా కోట్ చేసిన శాతాన్ని తగ్గించుకోవాలని కోరాలని అధికారులను ఆదేశించింది.
అయినప్పటికీ కాంట్రాక్టర్లు ససేమిరా అందుకు అంగీకరించలేదు. తాము కోట్ చేసిన మేరకు ఎక్సెస్‌గా లేకపోతే హ్యామ్ రోడ్లు చేపట్టలేమని కూడా వారు స్పష్టం చేశారు. హ్యామ్ రోడ్లపై వివాదం నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడి ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఈ వివాదం పై అధికారుల నుంచి సీఎం రేవంత్‌రెడ్డి నివేదిక కోరారు. టెండర్లలో కోట్ చేసిన ఎక్సెస్ మేరకు పనులు చేపడితే కాంట్రాక్టర్లు బ్యాంకుల నుంచి తీసుకునే 60 శాతం రుణానికి జీఎస్టీ, వడ్డీ చెల్లింపులు కలిపి 9.30 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని, అలాగే పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్‌ల నిర్వహణకు రెండు శాతం చొప్పునా 4 శాతం, స్వతంత్ర ఇంజనీర్ల చార్జీలు తదితర ఇతరత్రా ఖర్చులన్ని కలిపి అధికారికంగానే 15 శాతం ఎక్సెస్ ఇవ్వకతప్పదని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అధికారులు చెప్పిన ప్రకారం టెండర్లను ఖరారు చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా కావడంతో పాటు ఇందులో కుంభకోణం జరిగిందన్న చెడ్డపేరు వస్తుందని ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వీటికి అవకాశం లేకుండా పెట్రోలింగ్, అంబులెన్స్ వాహనాల నిర్వహణను రద్దు చేయాలని, అలాగే బ్యాంకర్లకు కాంట్రాక్టర్లు చెల్లించబోయే 9.30 శాతం వడ్డీ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఈ అంశంపై శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశం సమగ్రంగా చర్చించింది. కాంట్రాక్టర్లకు భారం కాకుండా అదనంగా అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించి హ్యామ్ రోడ్ల పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రిమండలి సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రిమండలి ఆమోదం కూడా తెలిపింది. దీంతో మొదటి నుంచి హరీశ్‌రావు వాదన మేరకే 5 శాతం మాత్రమే ఎక్సెస్‌తో హ్యామ్ రోడ్ల పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్ర ఖజానాకు రూ. 2 నుంచి రెండున్నర వేల కోట్ల అదనపు భారం తగ్గనున్నది. ఈ అంశంపై హరీశ్‌రావు మొదటి నుంచి అనేక వేదికల ద్వారా చేసిన పోరాటం ఫలించిందని చెప్పవచ్చు.













