
అమరావతి: పోలీసులు వేధిస్తున్నారని ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెనాలిలో సాయిబాబా, తిరుపతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. స్వర్ణలతకు సంబంధించిన నగలను తిరుపతమ్మ తాకట్టు పెట్టింది. నగలు తిరిగి ఇవ్వడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో స్వర్ణలత ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తిరుపతమ్మ, సాయిబాబాను స్టేషన్ కు తరలించి విచారించారు. తాకట్టు పెట్టిన దుకాణంలో తిరుపతమ్మ నగలు తీసుకెళ్లినట్టు విచారణలో తేలింది. తాము నగలు తాకట్టు పెట్టినవి స్వర్ణలతకు తెచ్చి ఇచ్చామని, తాము చెప్పిన కూడా పోలీసులు నమ్మడం లేదని, తన భర్తను పోలీస్ స్టేషన్ లో చితక బాదారని తిరుపతమ్మ వాపోయింది. ఎస్ఐ తనతో అసభ్యంగా మాట్లాడారని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తాను చనిపోయిన తరువాత తనకు న్యాయం చేయాలని సెల్ఫీ వీడియో తీసి జిల్లా కలెక్టర్ ను కోరారు. తిరుపతమ్మ గడ్డి మందు తాగడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. స్వర్ణలత, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి తమను బెదిరించారని సాయిబాబా తెలిపారు. వాళ్ల బెదిరింపులతో పాటు పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో తిరుపతమ్మ ఆత్మహత్య చేసుకొని ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.











