
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. రైతులకు భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్రలు చేస్తోందని, ప్రతి గింజ కేంద్రం కొనడంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలతో బిజెపి ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, ప్రజల అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు “రైతు ఘోస – బిజెపి భరోసా” పేరుతో బస్సు యాత్రలు చేపట్టడం పూర్తిగా రాజకీయ డ్రామా అని మండిపడ్డారు.
నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో రైతులపై సాగు వ్యయం భారీగా పెరిగిందని, ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా ఖర్చులు అన్నీ పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కానీ రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్న బిజెపి నేతలు ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కొనుగోలు చేసిన ధాన్యంలో బాయిల్డ్ రైస్ సాంక్షన్ చేయడంలోనూ, లేవీ రైస్‌కు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం సహకరించడం లేదని పొన్నం చురకలంటించారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పదేపదే కోరినా కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, కేంద్ర ప్రభుత్వం కేవలం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇచ్చిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందని, అదనంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని, రాష్ట్రవ్యాప్తంగా 8,575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 21 కోట్ల గోనె సంచులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, రైతుల ఖాతాల్లో 8,749 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించిందని, ఎన్నికల సమయంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, 60 సంవత్సరాలు దాటిన రైతులకు నెలవారీ పింఛన్లు ఇస్తామని బిజెపి ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని పొన్నం ఎద్దేవా చేశారు. వ్యవసాయ చట్టాల పేరుతో దేశవ్యాప్తంగా రైతులను ఇబ్బందులకు గురి చేశారని, 700 మందికి పైగా రైతుల ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చిన బిజెపి ఇప్పుడు రైతులకు భరోసా ఇస్తామని చెప్పడం నమ్మశక్యంంగా లేదని చురకలంటించారు. బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, రైతులకు మాత్రం నయా పైస రుణమాఫీ చేయకపోవడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొక్కజొన్న రైతులను అవమానపరుస్తూ క్వింటాకు కేవలం 10 మాత్రమే ఎంఎస్ పి పెంచడం సిగ్గుచేటు అని, దీనిపై కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని, రైతన్నలు బిజెపి నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతులపై లాఠీచార్జీలు చేయించిన ఘటనలు దేశ ప్రజలు అనేకం చూశారని, రైతుల బాధలను పట్టించుకోని బిజెపి నేతలు ఇప్పుడు రైతు ప్రేమ గురించి మాట్లాడటం కపట నాటకమన్నారు. ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా బిజెపి నాయకులను రైతులు ఎక్కడికక్కడ నిలదీయాలని సూచించారు. తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని పొన్నం కోరారు.












