
పిలుస్తున్నావనే ఇంకా నా కళ్ళు
చెవులు రిక్కించి చూస్తున్నవి
నీ మాటలు లేకుండా బతుకు
ఖాళీ గదిలా అయ్యింది
నువ్వేమో పోకడలను శిరస్సు
స్కంధాలపై మోస్తూ పోతున్నావు
ఎడారి ఒంటెలా మట్టిదిబ్బల
గతవర్తమానంలోకాళ్ళీడుస్తూ..
యుద్ధం మెదడును తొలిచేస్తోంది
దాన్ని ఆపే యత్నం
హృదయంలో కొట్టుకుంటోంది...
ఆలోపు జరిగేవన్నీ
శరీరమంతా పాకి నిన్నో నిప్పుల
కొలిమిలో కూర్చోబెడతాయి
నేనింకా అక్కడే ఉన్నా
ఎక్కడ మొదలెట్టామో..
నీ వరకు రావడానికి
నిన్ను ఆర్పేందుకు నేనిప్పుడు
కళ్ళచెమ్మనైనా కూడగట్టుకోవాలి
మనం గడిపిన దూరం కాలాల
మధ్యలో అల్లాడిన క్షణాలు చాలు
ఒక నదిలా నేను మారడానికి
నిన్ను ఆలింగనం చేసుకోడానికి...
- రఘు వగ్గు












