
ముంబయి: కారు లోయలో పడి ఎనిమిది మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో జరిగింది. మహాబలేశ్వర్-పోలాద్ పూర్ రోడ్డులోని అంబెనలి ఘాట్ వద్ద సోమవారం ఉదయం స్కార్పీయో వాహనం అదుపుతప్పి 1000 అడుగుల లోతుగల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. రెస్క్యూ టీమ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కఠినమైన కొండ ప్రాంతం కావడంతో మృతదేహాలను బయటకు తీయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మృతులు సతారా జిల్లాలోని కోరగామ్ తాలూకాలోని అస్గాన్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దీపాలీ నుంచి సతారా జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.













