
హైదరాబాద్: రాష్ట్రంలో పండిన ధాన్యమంతా ప్రభుత్వం తప్పక కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్యం అవుతోందని అన్నారు. ఈ సందర్భంగా సిఎల్పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లారీల కొరత సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇసుక లారీలు, ట్రాక్టర్లను కూడా ధాన్యం తరలింపు కోసం వాడుతున్నామని తెలియజేశారు. ఈ లోపు వర్షం పడి ధాన్యం తడిసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ధాన్యం తడిసి రంగు మారినా కొనుగోలు చేయాలని కలెక్టర్లను సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై బిఆర్ఎస్, బిజెపి నాటకాలు ఆడుతున్నాయన, ధాన్యం కొనుగోళ్ల గురించి మాట్లాడే హక్కు బిజెపి నేతలకు లేదని విమర్శించారు.
కేంద్రప్రభుత్వం 52 లక్షల టన్నులనే కొనుగోలు చేస్తామని చెప్పిందని, రాష్ట్రంలో కోటి టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చిందని అన్నారు. కేంద్రం మాత్రం 52లక్షల టన్నులకే మద్దతు ధర చెల్లిస్తామని చెప్పిందని, రాష్ట్రంలో మొత్తం ధాన్యం కొనాలని బిజెపి నేతలు కేంద్రానికి చెప్పాలని, బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయాలు ఆపి బిజెపి ప్రభుత్వం వద్దకు వెళ్లి అడగాలని విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేంద్రం కొనకపోయినా మొత్తం ధాన్యం కొనుగోళ్లను రాష్ట్రం చేపట్టిందని, కేంద్రం మద్దతు ధర ఇవ్వకపోయినా మరో 70 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తోందని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో 30, 40 లక్షల టన్నుల కంటే ఎక్కువ కొనుగోలు చేయలేదని, విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.











