నేను నా సాహితీ యాత్ర: వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. చిన్నప్పుడు దాదాపు అన్ని రకాల వ్యవసాయ పనులు చేసేవాడిని. మా ఊరు కృష్ణా నదికి మూడు కి.మీల దూరంలోనే ఉన్నప్పటికీ, మాకు నీటి సౌకర్యం ఉండేది కాదు. వ్యవసాయం మొత్తం వర్షాధారమే. అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి. అపరాలు, ప్రత్తి, మిర్చి, పొగాకు లాంటి పంటలు పండించే వాళ్ళం. లాటరీ లాంటి వ్యవసాయం. మా ఊరు నుంచి తుళ్లూరు నాలుగు కి.మీలు రోజూ నడుచుకుంటూ వెళ్లి హైస్కూల్ వరకు తాడికొండలో ఇంటర్ చదివాను. ఇంటర్ తప్పడంతో కొంతకాలం పూర్తిగా వ్యవసాయంలోనే మునిగి పోవాల్సి వచ్చింది. ఏ కష్టం ఎలా ఉన్నా, అమ్మా,నాన్న నన్ను ఎలాగైనా చదివించాలని తపనపడ్డారు. అప్పటికి మా నాన్నకు తెలిసిన చదువు అంటే బి ఏ మాత్రమే. అందుకే నన్ను హెచ్. ఈ. సి. గ్రూపులో చేర్పించాడు. ఇంటర్ పాస్ అయిన తర్వాత, గుంటూరు జే కే సి కాలేజీలో బి ఏలో చేరాను.

స్కూల్లోనూ, ఇంటర్‌లోనూ సాహిత్యం పట్ల కొంత అభిరుచి ఉండేది. అప్పట్లో యండమూరి, యుద్ధనపూడి, సూర్యదేవర లాంటి వాళ్ల రచనలు, మధుబాబు డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదివేవాడిని. ఆ ప్రభావంతో ఇంటర్‌లో ఉన్నప్పుడే మూడు నాలుగు కథలు రాశాను కానీ, అవి పత్రికల నుండి చక్కగా తిరుగు టపాలో వెనక్కి వచ్చేవి. ఇంటర్‌లో పాపినేని శివశంకర్, డిగ్రీలో కడియాల రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్లు, పాఠాలు చెప్పారు. కానీ బనారస్ హిందూ యూనివర్సిటీలో మిత్రుడు వలన, వీళ్ళు తిరిగి సాహిత్యకారులుగా నాకు పరిచయమయ్యారు. వాళ్ళ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా శివశంకర్ గారు నా కవిత్వ అభ్యాసనానికి ఓనమాలు దిద్దారు.

డిగ్రీ చదివే రోజుల్లో జెకెసి కాలేజీలోని లైబ్రరీని బాగా ఉపయోగించుకునేవాడిని. విశ్వనాథ వేయిపడగలు, అడవి బాపిరాజు గోనగన్నారెడ్డి లాంటి నవలలు, తిలక్ అమృతం కురిసిన రాత్రి, శ్రీ శ్రీ మహాప్రస్థానం లాంటివి అప్పట్లో చదివాను. బనారస్ లో ముత్యం నా పుస్తకాలు చదివే అలవాటుని వేగవంతం చేశాడు. వారానికి తప్పనిసరిగా ఓ పుస్తకం చదవడం, దాని గురించి చిన్న వ్యాసం రాయడమో, మాట్లాడడమో చేయాలనే నిబంధన మిత్రులందరికీ పెట్టడం వలన చాలా పుస్తకాలు చదివాను. ఆ క్రమంలోనే రాయడానికి, నా భావాన్ని వ్యక్తపరచడానికి, నేను చూసిన జీవితాన్ని అక్షరీకరించడానికి కవిత్వ ప్రక్రియను అందిపుచ్చుకున్నాను. కథలు నవలలు చదువుతుంటాను కానీ కవిత్వమే ఎక్కువగా రాస్తున్నాను.

నా మొదటి కవిత ‘రుధిరోత్సవం’ 1990 డిసెంబర్లో ఆంధ్ర పత్రికలో ప్రచురితమైంది. ఇప్పటివరకు చెమట చిత్తడి నేల, స్పర్శ, అనుపమ, ఊరికల, మావూరు- మాయిల్లు, దృశ్య రహస్యాల వెనుక, పొలం గట్ల వెంట కవితా సంపుటులు వెలువరించాను. రెండు కథలు, సాహిత్య విమర్శ వ్యాసాలు, పుస్తక సమీక్షలు చాలానే రాశా ను. వస్తు ప్రవాహంలోకి, చెదబట్టిన నాగళ్ళు, బృహస్పతుల ఖడ్గాలింగనాల లో, అకాల వర్షం, ముచ్చబోడు, అనుపమ, మాయమైన చేతులు, మృతనదీ తీరంలో, నా దేశపు నాలుగో స్తంభం, నాటకాంతం, ఇప్పుడు వీస్తున్న గాలి లాంటి అనేక కవితలు పాఠకుల, విమర్శకుల మన్ననలు పొందాయి.

ఊరి నుంచి వచ్చిన వాడిని కాబట్టి సహజంగానే నా కవిత్వంలో మట్టి, నీరు, పంట, నాగలి, వర్షం లాంటివి ఎక్కువగా ఉంటాయి. మట్టితో పెనవేసుకున్న బంధంతో పాటుగా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కాబట్టి పిల్లలు, బాల్యం, విద్య లాంటివి కూడా నా కవిత్వం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొంతకాలం హైదరాబాదులో అల్వాల్ లో దేవి ప్రియకు దగ్గరగా ఉండడంతో ఆయన సాహచర్యం వల్ల కవిత్వం పట్ల నిబద్ధత పెరిగింది. విజయవాడ సాహితీమిత్రులులో భాగమై అనేక సాహిత్య కార్యక్రమాల నిర్వహణలో పాలుపంచుకుంటున్నాను. 2015 ఏప్రిల్ నుండి కవితా! మాస పత్రికకు సంపాదకత్వం వహిస్తున్నాను. అలాగే 2004 నుండి సాహితీ మిత్రులు వెలువరిస్తున్న కవితా వార్షిక సంచికలకు గత ఐదేళ్లుగా అనిల్ డ్యానితో కలిసి సంపాదకత్వం వహిస్తున్నాను.

30 సంవత్సరాలుగా కవిత్వం రాస్తున్నాను కాబట్టి సహజంగానే కొన్ని గుర్తింపులు మరికొన్ని బహుమతులు వచ్చాయి. పలమనేరు వారి సృజన సాహితీ పురస్కారం, గుంటూరు జిల్లా రచయితల సంఘం పురస్కారం, తానా, తెల్సా లాంటి సంస్థల పురస్కారాలతో పాటుగా, కృష్ణా జిల్లా రచయితల సంఘం వారి ఆలూరి బైరాగి స్మారక పురస్కారం, ఒంగోలు కళా మిత్రమండలి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం లాంటివి కొన్ని గుర్తించదగ్గవి. హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం మొట్టమొదటిసారి విన్నప్పుడు’ రాగాలసుడుల్లో’ అనే కవిత రాసాను. ఆయన ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు అదే కవితను శాంతసుందరిగారితో అనువాదం చేయించి ఫ్రేమ్ కట్టించి ఆయనకు ఇవ్వడం అలాగే రెండోదానిపై ఆయనతో సంతకం చేయించి భద్రపరుచుకోవడం ఒక మరిచిపోలేని జ్ఞాపకం.

గత కొంతకాలంగా యువతరం సాహిత్యం వైపు పఠనంవైపు అడుగులు వేయడం గమనిస్తున్నాను. కొన్ని కథా సంకలనాలు, నవలలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడుపోవడం కూడా గమనిస్తున్నాను. ఇక్కడ రెండు విషయాలు చర్చించుకోవాలి. మొదటిది సోషల్ మీడియా పెరిగిన తర్వాత, రాసిన దాన్ని వెనుదిరిగి చూసుకోకుండా గోడల మీద అంటించడం,ఎంతమంది లైక్కొట్టారో చూసుకోవడం ఎక్కువైంది. అయితే ఆ రచనలలోని సాంద్రతను చూస్తే కొంత అసంతృప్తి అనిపిస్తుంది. అందుకే సొంత కవిత్వం (అప్పటికే పత్రికలలో ప్రచురితమైన కవితలే) అయినప్పటికీ, పుస్తక రూపంగా తెచ్చేటప్పుడు సంపాదకుడు ఉండాలని భావిస్తాను. రెండవది ఒకప్పటి యండమూరి, సూర్యదేవరలాంటి వాళ్ళ రచనలు చదివే లైటర్వేయిన్ పాఠకుల సంఖ్యలాగానే, ఇప్పుడు ఈ విధంగా మళ్లీ ఒకసారి పెరుగుతోందేమో అనిపిస్తుంది. గత పదేళ్లుగా తెలుగు సమాజంలో సామాజిక ఉద్యమ చైతన్యం తగ్గిపోవడం కూడా ఇందుకు కారణం అనిపిస్తుంది. ఈ మార్పు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. ఏదేమైనా తెలుగు భాషలో చదివే వారి సంఖ్య పెరగడం ఆశించదగ్గ మంచి పరిణామమే. 


- బండ్ల మాధవరావు