పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు క్షిపణులు, డ్రోన్ దాడులతో సాగిన అమెరికా-ఇరాన్ ఘర్షణలు… ఇప్పుడు భూతల యుద్ధానికి దారితీస్తున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
తాజాగా, ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ — ఐఆర్‌జీసీ — కువైట్ భూభాగంలోకి చొరబడిందని కువైట్ ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. కువైట్ రక్షణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం… ఐఆర్‌జీసీ సాయుధ దళాలు కువైట్‌లోని అతిపెద్ద ద్వీపం బుబియాన్‌లోకి ప్రవేశించి భూతల ఆపరేషన్‌కు ప్రయత్నించాయి.
ఈ క్రమంలో కువైట్ సైన్యం, ఐఆర్‌జీసీ బలగాల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఒక కువైట్ సైనికుడు గాయపడినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత గల్ఫ్ ప్రాంతంలో నేరుగా భూతల దాడి జరగడం ఇదే తొలిసారి కావడం అంతర్జాతీయ ఆందోళనలకు కారణమవుతోంది.
సుమారు 333 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న బుబియాన్ ద్వీపం… కువైట్ భద్రతకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక కేంద్రంగా భావిస్తారు. పర్షియన్ గల్ఫ్ ప్రవేశ ద్వారం వద్ద ఉండటంతో సముద్ర రవాణా మార్గాలపై నియంత్రణ సాధించేందుకు ఇది కీలకంగా మారింది. ఇదే ప్రాంతంలో అమెరికా తాత్కాలిక సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని భావిస్తోందన్న వార్తలు… ఇరాన్‌ను మరింత ఆగ్రహానికి గురి చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.














